ఓటర్ల నమోదుకు దరఖాస్తులు 23,87,942 

25 Sep, 2018 03:01 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న రజత్‌కుమార్‌

తుది జాబితాలో 2.80 కోట్ల ఓటర్లు! 

నామినేషన్ల గడువుకు 10 రోజుల ముందు వరకు ఓటుహక్కు నమోదు చేసుకోవచ్చు

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదుతోపాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు కలిపి మొత్తం 23,87,942 దరఖాస్తులొచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ ప్రకటించారు. ఇందులో 8.75 ల క్షల దరఖాస్తులు ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 10న చేపట్టిన ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ కార్యక్రమం కింద వచ్చాయన్నారు. గత జూలై 20 నుంచి ఈ నెల 10 వరకు నిర్వహించిన ఓటర్ల జాబితా మొదటి ప్రత్యేక సవరణ కార్యక్రమం కింద మిగిలిన దర ఖాస్తులొచ్చాయన్నారు. మొత్తం 23.87 లక్షల దరఖాస్తుల్లో 11 లక్షల దరఖాస్తుల పరిశీలన పూరైందని, 13 లక్షల దరఖాస్తులను పరిశీలించాల్సి ఉందని చెప్పారు. ఇంటింటా సర్వే నిర్వహించి దరఖాస్తులను పరిశీలిస్తున్నామన్నారు.

ముసాయిదా ఓటర్ల జాబితాలో 2.61 లక్షల ఓటర్లుండగా, తుది జాబితా ప్రకటించే సరికి 2.8 కోట్లకు పెరగవచ్చని అంచనా వేశారు. ముందస్తు ఎన్నికల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లపై సోమవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా కొత్త ఓటర్ల నమోదుతోపాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు మంగళవారం గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రజత్‌కుమార్‌ సూచించారు. కొత్త ఓటర్ల నమోదుతోపాటు అభ్యంతరాల స్వీకరణకు ఇదే చివరి అవకాశం కాదని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రత్యేక కార్యక్రమం షెడ్యూల్‌ ప్రకారం వచ్చే నెల 8న తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన తర్వాత కూడా కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణకు దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన అనంతరం అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ గడువుకు 10 రోజుల ముందు వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులతోపాటు అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొన్నారు.  

2,50,605 బోగస్‌ ఓటర్ల గుర్తింపు  
ఈఆర్వో నెట్‌ సాఫ్ట్‌వేర్‌ సహాయంతో రాష్ట్రంలో 4.92 లక్షల అనుమానాస్పద డూప్లికేట్‌(పునరావృత) ఓటర్లను ప్రాథమికంగా గుర్తించామని, పరిశీలన అనంతరం అందులో 2,50,605 బోగస్‌ ఓటర్లున్నట్లు సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా నిర్ధారణకు వచ్చామని రజత్‌ కుమార్‌ వెల్లడించారు. 2.5 లక్షల అనుమానిత బోగస్‌ ఓట్లలో ఇప్పటి వరకు 1,20,265 ఓట్ల విషయంలో క్షేత్రస్థాయిలో పరిశీలన సాగుతోందని, వారం రోజుల్లో మిగిలిన ఓట్ల పరిశీలన పూర్తి చేస్తామన్నారు. నిబంధనల ప్రకారం వారం ముందు నోటీసులు జారీ చేసి బోగస్‌ ఓట్లను తొలగిస్తామని, 1.80 లక్షల మంది ఓటర్లు మృతి చెందినట్లు గుర్తించామని, వారి పేర్లను జాబితాల నుంచి తొలగిస్తున్నామని చెప్పారు. 15,228 మందికి ఒకే నంబర్‌తో ఓటరు ఫొటో గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు గుర్తించామని, అందులో 7,614 మందికి కొత్త నంబర్లతో కొత్త గుర్తింపుకార్డులు జారీ చేస్తున్నామన్నారు.  

రాష్ట్రానికి చేరిన ఈవీఎంలు     
ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఈవీఎంలు రాష్ట్రానికి చేరాయని రజత్‌ కుమార్‌ ప్రకటించారు. 52 వేల బ్యాలెట్‌ యూనిట్లు, 40,700 కంట్రోల్‌ యూనిట్లు, 32,590 వీవీప్యాట్‌ యూనిట్లు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. 44 వేల వీవీ ప్యాట్‌ యూనిట్లు అవసరమని, మిగిలినవి ఒకట్రెండు రోజుల్లో చేరుతాయన్నారు. నాలుగో వంతు ఈవీఎంల పనితీరును పరీక్షించి చూస్తామని చెప్పారు. అత్యాధునిక వెర్షన్‌ ఈవీఎంలను ఈ ఎన్నికల్లో వినియోగిస్తున్నామని, ప్రాథమిక పరీక్షల్లో కేవలం 0.01 శాతం ఈవీఎంలలో మాత్రమే లోపాలు బహిర్గతమయ్యాయన్నారు. తొలిసారిగా వినియోగిస్తున్న వీవీ ప్యాట్‌ యూనిట్లలో 7 నుంచి 8 శాతం వరకు పరీక్షల్లో విఫలమవుతున్నాయని, దీంతో అదనపు వీవీ ప్యాట్‌లను పంపాలని ఈసీఐఎల్‌ను కోరామన్నారు. ఎన్నికల సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు వీవీ ప్యాట్లను మార్చేందుకు వీలుగా 30 శాతం యంత్రాలను అదనంగా సిద్ధం చేసి ఉంచుతామని, అక్టోబర్‌ 6లోగా ఈవీఎంలకు పరీక్షలు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల షెడ్యూల్‌పై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రజత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌పై పత్రికల్లో వస్తున్న ఊహాజనిత కథనాల్లో వాస్తవం లేదన్నారు.   

మరిన్ని వార్తలు