2030 నాటికి మనదే అగ్రస్థానం | Sakshi
Sakshi News home page

2030 నాటికి మనదే అగ్రస్థానం

Published Wed, Jan 4 2017 2:06 AM

2030 నాటికి మనదే అగ్రస్థానం - Sakshi

104వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన
శాస్త్ర సాంకేతిక రంగాల్లో తొలి మూడు దేశాల్లో ఒకటిగా భారత్‌
నూతన సవాళ్లను అసాధారణ వేగంతో ఎదుర్కోవాలి
విచ్ఛిన్నకర సాంకేతిక పరిజ్ఞానంపై ఓ కన్నేసి ఉంచాల్సిందే
శాస్త్రీయ విజ్ఞానంపై పరిశోధనలను మరింతగా ప్రోత్సహిస్తాం
రక్షణ, పరిశోధన రంగంలో మన ప్రగతి అమోఘం



తిరుపతి నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి : శాస్త్ర సాంకేతిక రంగాల్లో 2030 నాటికి భారతదేశం ప్రపంచంలోనే మొదటి మూడు దేశాల్లో ఒకటిగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. దేశంలో ఆయా రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు అమోఘమని కొనియాడారు. దేశ సమగ్రాభివృద్ధికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమే సమర్థ ఆయుధమని చెప్పారు. గతేడాది మైసూర్‌లో జరిగిన 103వ భారతీయ విజ్ఞాన సమ్మేళనం(ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌)లో 2035 టెక్నాలజీ విజన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేశామని, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రస్తుత సమావేశంపై ఉందని వెల్లడించారు. చిత్తూరు జిల్లా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైన 104వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సమావేశానికి ముఖ్యోద్దేశంగా ‘దేశాభివృద్ధి– శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం’అనే అంశాన్ని లక్ష్యంగా ఎంచుకోవడం ముదావహమని ప్రశంసించారు. సైన్స్‌ కాంగ్రెస్‌లో మోదీ ఇంకా ఏం చెప్పారంటే..

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్న సవాళ్ల తీవ్రత అసాధారణమైనది. వీటిని ఎదుర్కొనడంలో మనం అంతే అసాధారణ వేగంతో కదలాలి. నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు శాస్త్రీయ సంప్రదాయ దృక్పథంతో మనం ముందడుగు వేయాలి. శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధించిన పరిశోధనలను మరింతగా ప్రోత్సహిస్తాం. పరిశుభ్రమైన తాగునీరు, ఇంధనం, ఆహారం, పర్యావరణం, వాతావరణం, భద్రత, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలపై అధికంగా దృష్టి సారించాలి. విచ్ఛిన్నకర సాంకేతిక పరిజ్ఞానం పట్ల కూడా ఒక కన్నేసి ఉంచాలి.

సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్‌పై దృష్టి పెట్టాలి
గతేడాది జరిగిన సైన్స్‌ కాంగ్రెస్‌లో 2035 టెక్నాలజీ డాక్యుమెంట్‌ విడుదల చేశాం. 12 కీలక సాంకేతిక రంగాలకు సంబంధించి సమగ్రమైన ప్రణాళిక ప్రస్తుతం తయారవుతోంది. సమగ్ర, శాస్త్రీయ దృష్టితో నీతి ఆయోగ్‌ దీన్ని రూపొందిస్తోంది. మనం దృష్టి పెట్టాల్సిన మరో కీలక రంగం అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్‌. అసాధారణమైన సవాళ్లు, అపారమైన అవకాశాలున్న రంగాల్లో ఇదొకటి. రోబోటిక్స్, కృత్రిమ మేథో సంపత్తి, డిజిటల్‌ ఉత్పత్తులు, బిగ్‌ డేటా విశ్లేషణ, క్వాంటమ్‌ కమ్యూనికేషన్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి వాటిలో పరిశోధన, శిక్షణ, నైపుణ్యం సంపాదించడం ద్వారా మనం అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతాం. ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, జల వనరులు, ఇంధనం, ట్రాఫిక్‌ నిర్వహణ, ఆరోగ్యం, పర్యావరణం, మౌలిక వసతులు, జియో ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్, భద్రత, నేరాల నివారణ వంటి సేవలు, ఉత్పత్తి రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తు అవసరాలకు అనువైన రంగాల్లో పురోగతికి ఇంటర్‌ మినిస్టీరియల్‌ నేషనల్‌ మిషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది.



మన ముందు ఎన్నో అవకాశాలు
భారత ద్వీపకల్పం చుట్టూ ఉన్న సముద్రాల్లో 1,300కు పైగా ద్వీపాలు, 7,500 కిలోమీటర్ల తీరప్రాంతం, 24 లక్షల చదరపు కిలోమీటర్ల ఆర్థిక మండలి (ఎకనామిక్‌ జోన్‌) ఉన్నాయి. వీటిని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే భారతదేశంలో అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. మన దేశ సుస్థిరాభివృద్ధికి ఈ సముద్ర ఆధారిత ఆర్థిక అవకాశాలు ఉపయోగపడతాయి. వీటిపై దృష్టి పెట్టాలి. కేంద్ర భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ డీప్‌ ఓషన్‌ మిషన్‌ను ప్రారంభిస్తుంది. శాస్త్రీయ పరిశోధనా పత్రాల సమర్పణలో ప్రపంచంలోనే భారత్‌ ఆరో స్థానంలో ఉంది. మున్ముందు మన శాస్త్రవేత్తలు ప్రాథమిక పరిశోధనల్లో నాణ్యతను పెంపొందించాలి. 2030 నాటికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండే మూడు దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలుస్తుంది. ఆ దిశగా శాస్త్రీయ ప్రగతి చక్రాలు ముందుకు కదలాలి. నానాటికీ పెరిగిపోతున్న పట్టణ, గ్రామీణ వైరుధ్యాన్ని తగ్గించే దిశగా ప్రయోగాలు జరగాలి. సామాజిక అవసరాలకు దీటుగా భారతదేశం మరిన్ని పరిశోధనలు చేయాలి. దీనికి సంబంధించి సంబంధిత భాగస్వామ్య పక్షాలు సమన్వయంతో ముందుకు సాగాలి. మన మంత్రిత్వ శాఖలు, శాస్త్రవేత్తలు, పరిశోధనా అభివృద్ధి సంస్థలు, పరిశ్రమలు, స్టార్టప్‌లు, విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఇతరత్రా అన్ని సంస్థలు ఈ దిశగా సంయుక్తంగా సమన్వయంతో ముందుకు వెళ్లాలి. సామాన్యుడు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని సులభంగా అందిపుచ్చుకునేలా మన ప్రయోగాలు ఉండాలి. పరిశోధనలు ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో జరిగే అంశాన్ని పరిశీలించాలి.

శాస్త్రీయ సామాజిక బాధ్యత ఉండాలి
కార్పొరేట్‌ సామాజిక బాధ్యత మాదిరిగా శాస్త్రీయ సామాజిక బాధ్యత కూడా ఉండాలి. ఈ దృక్పథాన్ని అందరిలో అలవర్చేలా అంతా భాగస్వాములు కావాలి. అభిప్రాయాలు, వనరులను పరస్పరం ఇచ్చిపుచ్చుకొనే వాతావరణాన్ని కల్పించాలి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువు ముగిసిన వెంటనే ఉపాధి తథ్యమన్న భరోసా కల్పించేంత ఉన్నతస్థాయిలో శిక్షణ ఉండాలి. ఇందుకోసం దేశంలోని ప్రయోగశాలలు స్కూళ్లు, కాలేజీలతో అనుసంధానమై సరైన శిక్షణ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మన శాస్త్ర సాంకేతిక మౌలిక వనరులను సమర్థంగా వినియోగించుకోగలుగుతాం. పరిశోధనతో సంబంధమున్న కళాశాలల అధ్యాపకులు ఇరుగుపొరుగు విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో సంబంధాలు పెంపొందించుకోవాలి. అక్కడ నేర్చుకున్న అంశాలను విద్యార్థి లోకానికి తెలియజేయాలి. ఇలా చేయడం వల్ల పాఠశాల విద్యార్థుల్లో నూతన ఆలోచనలకు బీజం వేసినట్లు అవుతుంది. ఈ దిశగా శాస్త్రీయ సాంకేతిక మంత్రిత్వ శాఖ 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులపై ఇప్పటికే దృష్టి సారించింది. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులపై దృష్టిపెట్టి, స్థానిక అవసరాలకు అనువుగా 10 లక్షల వినూత్న ఆలోచనలను స్వీకరించేలా ఈ కార్యక్రమం రూపుదిద్దుకొంటోంది. గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన సూక్ష్మస్థాయి పరిశ్రమల నమూనాలను తయారు చేయాలి. ఇలా చేయడం వల్ల స్థానిక అవసరాలు తీరుతాయి. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

‘ఇస్రో’ప్రగతి అపారం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అపారమైన ప్రగతిని సాధించింది. సర్వే ఆఫ్‌ ఇండియా, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల మధ్య మరింత సమన్వయం ఉండాలి. సీఐఐ, ఫిక్కి, ఇతర ప్రముఖ ప్రైవేట్‌ కంపెనీలతో, ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యంతో కార్యక్రమాలు చేపట్టే దిశగా చర్చలు జరుగుతున్నాయి. అంతరిక్ష పరిజ్ఞానంలో స్వయం సమృద్ధిని సాధించాం. దేశీయంగానే సైనిక సంపత్తిని అభివృద్ధి పర్చడంలో రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ ముందంజలో ఉంది. ఇరుగుపొరుగు దేశాలతోపాటు బ్రిక్స్‌ వంటి అంతర్జాతీయ వేదికలతో సైతం శాస్త్ర సాంకేతిక సంబంధాలను ఏర్పరచుకుంటున్నాం. గతేడాది 3.6 మీటర్ల ఆప్టికల్‌ టెలిస్కోపును ఉత్తరాఖండ్‌లోని దేవస్థల్‌లో ప్రారంభించాం. ఇందుకు బెల్జియం తోడ్పాటునందించింది. అమెరికాతో కలసి ‘లిగో’ప్రాజెక్టును అమలు చేసేందుకు ఇటీవల ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం శాస్త్రవేత్తలను, శాస్త్రీయ పరిశోధనా సంస్థలను ప్రోత్సహిస్తోంది’’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, హర్షవర్దన్, ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ జనరల్‌ ప్రెసిడెంట్‌ డి.నారాయణరావు, ఎస్వీయూ వీసీ ఆవుల దామోదరం తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement