అసెంబ్లీలో కాంగ్రెస్ దూకుడే!

7 Mar, 2015 04:28 IST|Sakshi
అసెంబ్లీలో కాంగ్రెస్ దూకుడే!

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై సర్కారు తీరును ఎండగడుతూ అసెంబ్లీ సమావేశాలను వేడెక్కించాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) నిర్ణయించింది. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చేసే ప్రసంగాన్ని సైతం అడ్డుకోవాలన్న ఆలోచనతో ఆ పార్టీ ఉన్నట్లు సమాచా రం. హైకోర్టు నోటీసులిచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై, గవర్నర్ కూడా మౌనంగా ఉండడంపై సభలో నిలదీయాలని సీఎల్పీ నిర్ణయించింది. పార్టీ ఫిరాయింపులపై అధికారపక్షం తీరును ఎండగట్టేందుకు దూకుడుగా ముందుకెళ్లాలని అభిప్రాయపడుతోంది. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలు లో ఉదయం 11 నుంచి సాయంత్రం వరకు సీఎల్పీ సుదీ ర్ఘంగా సమావేశమైంది.

సీఎల్పీ నేతలు కె.జానారెడ్డి, డి.శ్రీనివాస్, పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమా ర్క, ఎంపీలు వి.హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇతర నేత లు హాజరయ్యారు. ఎమ్మెల్యేల్లో జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినహా మిగతావారం తా హాజరయ్యారు. రైతుల ఆత్మహత్యలు, కరెంట్, నీళ్లు, సచివాలయం తరలింపు, ఛాతీ ఆసుపత్రి తరలింపు, ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాల భూపంపిణీ, ప్రభు త్వ భూముల అమ్మకం, కేజీ టు పీజీ అమలు, శాంతిభద్రతలు, ఉద్యోగాల భర్తీ వంటి ప్రధానమైన 28 అంశాలను ప్రస్తావించాలని నిర్ణయించారు. సబ్జెక్టుల వారీగా ఎమ్మెల్యేలు అధ్యయనం చేసి సన్నద్ధం కావాలని నేతలు అభిప్రాయపడ్డారు. సమావేశాల్లో ప్రభుత్వ తీరును ఎండగట్టి సమస్యల పరిష్కారానికి ఒత్తిడిని తీసుకురావాల్సి ఉందని జానారెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది.

అధికారపక్షంపై యుద్ధానికి సిద్ధం: రాష్ర్ట ప్రభుత్వం పట్ల ఇంతవరకు కొంత మెతక వైఖరిని అవలంభించామని, ఇకపై దూకుడుగా యుద్ధానికి సన్నద్ధం కావాలని, అసెంబ్లీలో అధికారపక్షాన్ని తూర్పారబట్టాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ విషయంలో సీఎల్‌పీ నేత జానారెడ్డి కూడా గట్టిగా వ్యవహరించాలని, మరింత జోరును పెంచేలా కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని కొందరు ఎమ్మెల్యేలు సూచించారు. సభా నియమాలకు అతీతంగా అధికారపక్షం వ్యవహరిస్తే అడ్డుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు.
 
పలు తీర్మానాల కోసం పట్టు
కేంత్రం తలపెట్టిన భూసేకరణచట్ట సవరణ, రైల్వే, సాధారణ బడ్జెట్ ప్రతిపాదనల్లో కోతలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలపై అసెంబ్లీ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించేలా సర్కారుపై ఒత్తిడిని తీసుకురావాలని సీఎల్పీ నిర్ణయించింది. కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో రాష్ర్టం రూ. 9 వేల కోట్లు నష్టపోయిందని, ఈ అన్యాయాన్ని సరిదిద్దేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలనే అభిప్రాయం వ్యక్తమైంది. కాగా, హైకోర్టు విభ జనకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సీఎల్‌పీ నిర్ణయించింది. యూపీఏ హయాంలో చేసిన ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఈ సందర్భంగా తీర్మానాన్ని ఆమోదించింది.

యాదగిరిగుట్టను యాదాద్రిగా చేస్తామని చెబుతూ భద్రాద్రిని పట్టించుకోకపోతే ఎలాగని ఎమ్మె ల్సీ పొంగులేటి సుధా కర్‌రెడ్డి ప్రశ్నించారు. దీంతో దీనిపై సీనియర్ నేతలతో చర్చించి కార్యాచరణను రూపొందిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది. గతంలో  ఏర్పాటు చేసిన వ్యూహరచన కమిటీని పునరుద్ధరించుకుని, వ్యూహాలను సిద్ధం చేసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చారు. సమావేశం ప్రారంభంలో వీహెచ్‌కు, ఎమ్మెల్సీ ఎం.రంగారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. అలాగే మరో ఎంపీ పాల్వాయి తీరును కొందరు ఎమ్మెల్యేలు విమర్శించారు. అనంతరం ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతు రాజకీయాలకంటే, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌కు ముఖ్యమన్నారు. మిగతా పక్షాలతో సమన్వయం చేసుకుని పోరాడతామన్నారు.

>
మరిన్ని వార్తలు