పేట్రేగుతున్న ఆటోవాలాలు

17 Sep, 2014 02:37 IST|Sakshi

నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ దుబ్బ ప్రాంతానికి చెంది న ఓ యువతి వారం క్రితం కళాశాలకు వెళ్లేం దుకు ఆటో ఎక్కింది. డ్రైవర్ పక్క సీట్లో మరో యువకుడు కూర్చొని ఉన్నాడు. ఆటో కొద్ది దూ రం వెళ్లిన తర్వాత డ్రైవర్ ఆటోను ఆపి యువతి పక్కన కూర్చున్నాడు. ఆ యువతితో అసభ్యం గా ప్రవర్తించసాగాడు. దీంతో ఆమె వెంటనే ఆటోలోంచి దూకింది. ఆటో నంబర్ నోట్ చేసుకొని మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిం ది. ఆమె ఇచ్చిన నంబరు ఆధారంగా పోలీసు లు రంగంలోకి దిగి ఆటోను పట్టుకున్నారు. డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నాడు.


 నగర శివారులోని ఆర్మూర్‌రోడ్డులో గల గంగాస్థాన్ ఫేస్ -2లో నివసించే ఓ మహిళ తన కుమారుడిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు లక్ష్మి కళ్యాణ మండపం వద్ద ఆటో ఎక్కింది. ఆటో తన ఇంటికి సమీపించినా డ్రైవర్ వాహనాన్ని నిలపలేదు. దీంతో అనుమానం వచ్చి ఆమె కేకలు వేసింది. అయినా ఆటోను ఆపకుండా వెళ్లడంతో ఆమె ధైర్యం చేసి కుమారుడితో సహా కిందకి దూకేసింది. డ్రైవర్ వాహనంతో సహా పారిపోయాడు. ఆటో డ్రైవరు ముఖానికి అడ్డంగా బట్ట కట్టుకున్నాడని, దీంతో డ్రైవర్‌ను గుర్తించలేకపోయానని బాధితురాలు తెలిపారు. అయితే ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

 ఇరవై రోజుల క్రితం జిల్లా కేంద్రంలో మరో ఘటన జరిగింది. సుభాష్‌నగర్‌లో ఓ యువతి ఆటో ఎక్కింది. ఆ సమయంలో డ్రైవర్ పక్క సీట్లో మరో యువకుడు ఉన్నాడు. ఆటో కొద్ది దూరం వెళ్లాక డ్రైవర్ పక్కన కూర్చొన్న వ్యక్తి ఆ యువతి ముఖంపై మత్తు మందు చల్లాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. దుండగులు ఆమెను కారులో మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్లకు తీసుకెళ్లారు. స్పృహలోకి వచ్చిన యువతి.. కిడ్నాపర్ల కళ్లుగప్పి తప్పించుకొని తండ్రికి ఫోన్ చేసింది.

ఆయన తెలిసినవారి సహాయంతో కూతురు క్షేమంగా ఇంటికి చేరేలా చర్యలు తీసుకున్నారు. అయితే బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు.

 పది నెలల క్రితం ఓ మహిళ ముంబయికి వెళ్లేందుకు నిజామాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చిం ది. ఆమె వద్ద డబ్బులు లేకపోవడంతో ఆటోవాలాను డబ్బులు అడిగింది. తనతో వస్తే డబ్బు లు ఇప్పిస్తానని అతడు చెప్పడంతో ఆమె తన మూడేళ్ల కూతురితోపాటు ఆటో ఎక్కింది. ఆమె ను సారంగపూర్ వైపు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడిన అనంతరం దారుణంగా హత్య చేశా డు. ఈ కేసు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలి ఉంది.

 ‘వెకిలి’ సంఘటనలు ఎన్నో..
 ఇలా పలువురు ఆటోవాలాలు వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. ఒంటరిగా ప్రయాణించే మహిళలతో అసభ్యం గా ప్రవర్తిస్తున్నారు. ఆటోల్లో ఎక్కే మహిళలను మాటల్లో దింపుతున్నారు. కొద్దిసేపయ్యాక ద్వంద్వార్థాలు వచ్చేలా సంభాషిస్తున్నారు. అయితే ఏం చేయాలో తెలియక చాలా మంది మహిళలు మిన్నకుండిపోతున్నారు.


 రోడ్డు పక్కన నిలబడిన వారి వద్దకు వచ్చి ఆటోలు ఆపుతున్నారు. వారు ఆటోలో ఎక్కడానికి నిరాకరిస్తే తిడుతూ వెళ్లిపోతున్నారు. కిరాయి కుదరక ప్రయాణికులు ఆటోలో ఎక్కపోయినా.. పలువురు డ్రైవర్లు ఇలాగే చేస్తున్నారు.
 
టాప్‌పై నంబర్లు లేవు

 పోలీసు స్టేషన్లు జారీ చేసే నంబర్లు ఆటో టాప్ వెనక భాగంలో ఉంటే.. ఆగడాలకు పాల్పడే ఆటోలను గుర్తించడానికి వీలుంటుంది. అయితే నగరంలో తిరుగుతున్న చాలా వాహనాలకు ఈ నంబర్లు లేవు. దీంతో ఏ వాహన డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించారో గుర్తించడానికి వీలు లేకుండా పోతోంది. జిల్లా కేంద్రంలో నిత్యం ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఆటోలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఓవర్ లోడ్, ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించి చేతులు దులుపుకుంటున్నారు. టాప్ నంబర్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై చర్యలు తీసుకోవడం లేదు.

మరిన్ని వార్తలు