అడవి పంది దాడి.. ఒకరు మృతి | Sakshi
Sakshi News home page

అడవి పంది దాడి.. ఒకరు మృతి

Published Wed, Sep 17 2014 2:38 AM

అడవి పంది దాడి.. ఒకరు మృతి

ప్రొద్దుటూరు క్రైం:
 ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని కామనూరు పంట పొలాల్లో మంగళవారం పంది దాడి చేసింది. దీంతో చెన్నం లక్ష్మినారాయణరెడ్డి (53) అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. పొలంలో పని చేస్తున్న కూలీల వైపు పంది వస్తుండంతో దాన్ని తోలేందుకు రైతు వెళ్లాడు. అయితే రైతు మీదికే వచ్చిన పంది అతన్ని కింద పడేసి కసితీరా కరచి గాయ పరచింది. పోలీసుల కథనం మేరకు...దువ్వూరు మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన చెన్నం లక్ష్మినారాయణరెడ్డి వ్యవసాయం చేసుకొని జీవనం సాగించేవాడు. అతనికి భార్య లక్ష్మిదేవితో పాటు కుమారులు శ్రీకాంత్‌రెడ్డి, నారాయణరెడ్డి ఉన్నారు. కుమార్తె ప్రమీలకు వివాహమైంది. తండ్రితోపాటు కుమారులిద్దరూ వ్యవసాయం చేసేవారు. వారికి నేలటూరుకు వెళ్లే దారిలో కామనూరు కుందూ నది వద్ద ఆరు ఎకరాల పొలం ఉంది. ఈ ఏడాది ఆరు ఎకరాలతో పాటు పక్కనే ఉన్న మరో 12 ఎకరాలను కౌలుకు తీసుకొని వరి సాగు చేశారు. కలుపు తీయడానికి మంగళవారం కూలీలు వెళ్లారు. 
 పందిని చూసి 
 కూలీలు భయపడుతున్నారని...
 పొలంలో కూలీలు కలుపు తీస్తుండగా అడవి పంది వారివైపే వచ్చింది. దాన్ని గమనించిన కూలీలు భయపడి విషయాన్ని లక్ష్మినారాయణరెడ్డికి  చెప్పారు. దీంతో అతను పరుగెత్తుకుంటూ అక్కడికి చేరుకొని గట్టిగా కేకలు వేస్తూ పందిని తోలే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే పంది ఒక్కసారిగా రైతుపై దాడి చేసింది. తీవ్రంగా గాయపరచింది. దీంతో అతను పొలంలోనే కుప్పకూలి పోయాడు. కూలీలందరూ గట్టిగా కేకలు వేయడంతో పంది అక్కడి నుంచి పారిపోయింది. అందరూ అక్కడికి వెళ్లి చూడగా రైతు లక్ష్మినారాయణ రెడ్డి అపస్మారకస్థితిలో పడిపోయి ఉన్నాడు. వెంటనే అతన్ని సమీపంలోని కామనూరు ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  రైతు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.  విషయం తెలియడంతో గ్రామస్తులతో పాటు బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. రూరల్ ఎస్‌ఐ జీఎండి బాషా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 
 
 
 
 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement