డ్రైవర్‌ అభ్యర్థులకు ఆర్టీసీ లైసెన్స్‌!

25 Jan, 2017 02:38 IST|Sakshi
ఆర్టీసీ కళాభవన్‌లో కరీంనగర్‌ జోన్‌ డ్రైవర్‌ రఫీకి అవార్డు అందజేస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి.

శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందాక నేరుగా జారీ
రవాణాశాఖ ప్రమేయం లేకుండా కొత్త విధానం
ఉత్తమ డ్రైవర్లకు పురస్కారాల సందర్భంగా ఆర్టీసీ ఎండీ వెల్లడి


సాక్షి, హైదరాబాద్‌:  ఆర్టీసీ బస్సులు నడిపే డ్రైవర్లు, ఆర్టీసీలో డ్రైవర్‌గా ఉద్యోగం కావా లనుకునే అభ్యర్థులకు ఇకముందు హెవీ వెహికిల్‌ డ్రైవర్‌ లైసెన్సు ఆర్టీసీనే మంజూరు చేయనుంది. ప్రస్తుతం డ్రైవింగ్‌ లైసెన్సులను రవాణాశాఖ నుంచి మాత్రమే పొందేలా నిబంధన ఉంది. ఇక ముందు ఆర్టీసీ బస్సు డ్రైవర్లుగా చేరే వారికి మాత్రం ఆర్టీసీనే లైసెన్సు మంజూరు చేయనుంది. ఈ మేరకు మోటారు వాహన నిబంధనలలో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. హైదరాబాద్‌లో బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో మంగళవారం 28వ జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భం గా ఉత్తమ డ్రైవర్లకు పురస్కారాలను ప్రదానం చేశారు. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ రమణారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రమణా రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ లైసెన్సుల అంశాన్ని వెల్లడించారు. మెరుగైన శిక్షణ తర్వాతే లైసెన్సు జారీ చేస్తే మంచిదన్న ఉద్దేశంతో కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తోందని ఆయన చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లినప్పుడు.. కేంద్ర యంత్రాంగం ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చిందన్నారు. భవిష్యత్తులో ఇతర ప్రాంతా ల నుంచి వచ్చే ఆర్టీసీ డ్రైవర్లకు కూడా ఇక్కడ శిక్షణ ఇచ్చే అవకాశముందని, వారికి కూడా టీఎస్‌ ఆర్టీసీనే డ్రైవింగ్‌ లైసెన్సులు మంజూ రు చేస్తుందని వెల్లడించారు. ప్రమాద రహిత డ్రైవింగ్‌ ద్వారా తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్లు సాధించిపెట్టిన గుర్తింపే ఇదన్నారు.

రోడ్డు భద్రత జీవన విధానం కావాలి
రోజురోజుకు పెరిగిపోతున్న ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత జీవన విధానంగా మారాల్సి ఉందని మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వ రవాణా సంస్థల్లో కలిపి.. లక్ష కిలోమీటర్లకు 0.07 చొప్పున ప్రమాదాలతో టీఎస్‌ ఆర్టీసీ అతి తక్కువ ప్రమాదాలను నమోదు చేసిందన్నారు. మూడు దశాబ్దాల సర్వీసులో ఒక్క ప్రమాదానికీ కారణం కాని డ్రైవర్లు టీఎస్‌ ఆర్టీసీలో 100 మంది ఉండటం గర్వకారణమన్నారు. గత మూ డేళ్లుగా ఆర్టీసీ బస్సు ప్రమాదాల మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోందని, దానిని సున్నాకు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి, జోన్‌ స్థాయిలో 12 మంది డ్రైవర్లను నగదు పురస్కారాలు, జ్ఞాపిక శాలువాలతో సన్మానించారు. డ్రైవర్లతోపాటు వారి కుటుంబ సభ్యులను కూడా వేదికపైకి పిలిచి అభినందించారు.

పురస్కారాలు పొందింది వీరే
రాష్ట్ర స్థాయిలో కరీంనగర్‌ జోన్‌ బాన్సువాడ డిపో డ్రైవర్‌ మహ్మద్‌ రఫీ ప్రథమస్థానంలో నిలవగా రూ.12 వేల నగదుతో సత్కరించారు. రెండోస్థానం లో నిలిచిన కరీంనగర్‌–2 డిపో డ్రైవర్‌ కరీముద్దీన్‌కు రూ.10వేలు, మూడో స్థానంలో నిలిచిన మెహిదీపట్నం డ్రైవర్‌ ఇబ్రహీంకు రూ.8వేలు అందజేశారు. ఇందులో రఫీ 33 ఏళ్ల 2 నెలల సర్వీసు, కరీముద్దీన్‌ 32 ఏళ్ల 11 నెలలు, ఇబ్రహీం 32ఏళ్ల 10నెలల సర్వీసులో ఒక్క ప్రమా దానికి కూడా కారణం కాకపోవడం విశేషం. జోన్‌ స్థాయిలో హయత్‌నగర్‌కు చెందిన కేఎల్‌రెడ్డి, కల్వకుర్తికి చెందిన కుమార్, కరీంనగర్‌కు చెందిన అమీను ద్దీన్, కృష్ణ, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన పెంటయ్య, నల్లగొండకు చెందిన రంగయ్య, ఉప్పల్‌కు చెందిన రాములు, మహబూబ్‌నగర్‌కు చెందిన కేశయ్య, నిర్మల్‌కు చెందిన జహీర్‌ అహ్మద్‌లకు పురస్కారాలు ప్రదానం చేశారు.

>
మరిన్ని వార్తలు