‘రిటర్న్‌లపై’ ప్రచార రథాలు 

10 Aug, 2019 02:24 IST|Sakshi

ప్రారంభించిన ఇన్‌కం ట్యాక్స్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ శంకరన్‌

రిటర్న్‌ల ఇ–ఫైలింగ్‌ గడువు ఆగస్టు 31 వరకు పెంపు 

హైదరాబాద్‌: ఆదాయపు పన్ను రిటర్న్‌ల చెల్లింపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమాచార ప్రచార రథాలను హైదరాబాద్‌ ఆదాయపు పన్ను విభాగం ప్రారంభించింది. శుక్రవారం ఏసీ గార్డ్స్‌లోని ఇన్‌కం ట్యాక్స్‌ భవన సముదాయంలో జరిగిన ‘కర్‌దాతా ఇ–సహయోగ్‌’కార్యక్రమంలో ఇన్‌కం ట్యాక్స్‌ (ఏపీ అండ్‌ తెలంగాణ) ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఎన్‌.శంకరన్‌ ఈ ప్రచార రథాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రచార రథాల ద్వారా ప్రజలను జాగృతం చేయడంతోపాటు సందేహాలను నివృత్తి చేస్తామని తెలిపారు. జంట నగరాల్లో ఈ రథాలు ఆగస్ట్‌ 24 వరకు సంచరిస్తాయని పేర్కొన్నారు. ఇక ఆదాయపు పన్ను రిటర్న్‌ల ఇ–ఫైలింగ్‌ గడువును పొడిగించినట్లు ఆయన వెల్లడించారు.

ఇ–ఫైలింగ్‌ను ఈ నెల 31లోగా ఇంటర్నెట్‌ ద్వారా చేయాల్సి ఉంటుందన్నారు. గడువులోగా చేయకుంటే 234 ఎఫ్‌ యాక్ట్‌ ప్రకారం వడ్డీతో సహా మరో రూ.5 వేలు అదనంగా చెల్లించాలని తెలిపారు. ఇన్‌కం ట్యాక్స్‌ హైదరాబాద్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ఆర్కే ఫలివాల్‌ మాట్లాడుతూ.. డిజిటలైజేషన్‌లో భాగంగా ఇ–ఫైలింగ్‌ తప్పనిసరి చేశామన్నారు. సీనియర్‌ సిటిజన్లకు మాత్రం ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో మినహాయింపు ఉంటుందని చెప్పారు. ఇన్‌కం ట్యాక్స్‌ హైదరాబాద్‌ విభాగం చీఫ్‌ కమిషనర్‌ అతుల్‌ ప్రణయ్‌ మాట్లాడుతూ.. జూలై 31వరకు ఉన్న రిటర్న్‌ల గడువును సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) పొడిగించిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కం ట్యాక్స్‌ సెంట్రల్‌ కె.కామాక్షి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు