పెద్దనోట్లపై చర్చకు భయపడిన కాంగ్రెస్‌

19 Dec, 2016 03:07 IST|Sakshi
పెద్దనోట్లపై చర్చకు భయపడిన కాంగ్రెస్‌

కేంద్ర కార్మికశాఖమంత్రి బండారు దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్‌: పెద్దనోట్ల రద్దు నేపథ్యం, పరిణామాలపై చర్చించడానికి కాంగ్రెస్‌ పార్టీతో సహా ప్రతిపక్షాలు భయపడి, పార్లమెంటు సమావేశాలు జరగకుండా అడ్డుకున్నాయని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీలు పార్లమెంటులో చర్చను జరగకుండా స్తంభింపజేయడం దురదృష్టకరమన్నారు. పార్లమెంటులో చర్చ జరిగితే కాంగ్రెస్‌ పార్టీ గతంలో చేసిన కుంభకోణాలు, మలినమైన చరిత్ర, స్కాములు, బ్లాక్‌మనీకి కారణాలు బయటకు వస్తాయనే భయంతోనే సభకు అంతరాయం కలిగించిందని దత్తాత్రేయ ఆరోపించారు.

మోదీ తీసుకున్న సాహసోపేతమైన పెద్దనోట్ల రద్దు నిర్ణయంవల్ల నల్లధనానికి అడ్డుకట్ట పడుతుందన్నారు. ఆర్‌బీఐ అధికారులతో మాట్లాడి రాష్ట్రానికి 19 వేల కోట్లు కరెన్సీ తెచ్చామని చెప్పారు.  పెద్దనోట్ల రద్దుపై రాష్ట్ర శాసనసభలో చర్చ సంతోషకరమన్నారు. పెద్దనోట్ల రద్దుపై చర్చకు, టీఆర్‌ఎస్‌తో బీజేపీ రాజకీయ స్నేహానికి సంబంధం లేదన్నారు.  పెద్దనోట్ల రద్దు వద్దు అని ఏ పార్టీ అనలేదనీ, కమ్యూనిస్టులతో సహా అందరూ పెద్దనోట్ల రద్దు ఉద్దేశాన్ని అంగీకరిస్తూనే.. దుష్ప్రచారం చేస్తున్నారనీ ఇది తగదని దత్తాత్రేయ అన్నారు.

మరిన్ని వార్తలు