తెలంగాణ పండుగకు బతుకమ్మ బ్రాండ్

30 Sep, 2014 23:46 IST|Sakshi

సిద్దిపేట అర్బన్: ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా పువ్వులను పండుగగా మార్చిన సంస్కృతి ఒక్క తెలంగాణకు మాత్రమే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత అన్నారు. సిద్దిపేటలో మంగళవారం సాయంత్రం జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. రాత్రి కోమటి చెరువు వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణకు బ్రాండ్‌గా ఉంటుందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే సిద్దిపేటకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని ఇది సిద్దిపేట ప్రజలు గర్వించదగ్గ విషయమన్నారు. బంగారు తెలంగాణ సాధనలో బతుకమ్మ పండుగ పునాదిగా మారాలన్నారు. ఈ విశిష్టమైన బతుకమ్మ పండుగను బావి తరాలకు పదిలంగా అందించడానికే ప్రతీయేటా బతుకమ్మ పండుగలను జాగృతి నిర్వహిస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ నిరాదరణకు గురైందని ఇప్పుడు రాష్ట్రం ఏర్పడినందు వల్ల మన సంస్కృతిని మనం రక్షించుకోవాలని, ప్రపంచానికి చాటిచెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.

 ఐక్యతను పెంచిన బతుకమ్మ పండుగ: మంత్రి హరీష్
 తెలంగాణ సుదీర్ఘ ఉద్యమ పథంలో బతుకమ్మ పండుగ అన్ని వర్గాల ప్రజలను ఐక్యంగా నిలిపిందని సమావేశానికి అధ్యక్షతన వహించిన మంత్రి హరీష్‌రావు అన్నారు. ప్రపంచమంతట బతుకమ్మ పండుగను నిర్వహించడం మన సంస్కృతి గొప్పతనానికి నిదర్శనమన్నారు. మున్ముందు ఈ పండుగను మరింత వేడుకగా నిర్వహిస్తామన్నారు.

 మహిళలకు బతుకమ్మ బంగారు కానుక: డిప్యూటీ స్పీకర్
 రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి తెలంగాణ ఆడ పడచులకు బతుకమ్మను కానుకగా ఇచ్చారని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చెప్పారు. 14 యేండ్ల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఇందు లో అమరులైన అమరవీరుల తల్లుల గర్బశోకం తీర్చడానికి కేసీఆర్ రూ. పది లక్షల ఎక్స్‌గ్రేషియాను చెల్లిం చేందుకు నిర్ణయించడం అభినందనీయమన్నారు.

కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, రామలింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, కలెక్టర్ రాహుల్ బొజ్జా, జెడ్పీ చైర్మన్ రాజమణి తదితరులు మాట్లాడుతూ ఉద్యమ పురిటిగడ్డ సిద్దిపేటలో బతుకమ్మ ఉత్సవాలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన ఘనత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకే దక్కుతుందన్నారు. అనంతరం బతుకమ్మలను కోమటి చెరువులో నిమజ్జనం చేశారు. కాగా  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఘన స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు