7 రూపాయలతో ఎన్ని ప్రయోజనాలో..

30 Jun, 2014 00:51 IST|Sakshi
7 రూపాయలతో ఎన్ని ప్రయోజనాలో..

సాక్షి, హైదరాబాద్ : దుకాణాలు, వాణిజ్య సంస్థలు, ఇతర ఎస్టాబ్లిష్‌మెంట్లలో పనిచేసే కార్మికు ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమ నిధి ద్వారా అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. అటు యజమానులకు, ఇటు కార్మికులకు వీటిపై సరైన అవగాహన లేక ఈ ప్రయోజనాలను కార్మికులు, ఉద్యోగులు పొందలేకపోతున్నారు. కేవలం ఏడాదికి ఏడు రూపాయలు చెల్లిస్తే కార్మికులకు, వారి కుటుంబాలకు ఎన్నో రకాల ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి.
 
వీరికే వర్తింపు..
కార్మిక సంక్షేమ నిధి చట్టం (1987) ద్వారా సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి నిర్వహణ కోసం కార్మిక సంక్షేమ మండలిని ఏర్పాటు చేశారు.
దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్టం(1988) కింద పేర్కొన్న సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు
1948 ఫ్యాక్టరీ చట్టం కింద పేర్కొన్న కంపెనీలలో పనిచేసే కార్మికులు
1961 మోటారు రవాణా సిబ్బంది చట్టం కింద పనిచేస్తున్న కార్మికులు
రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీస్ యాక్టు కింద నమోదైన సహకార సంఘాలు
ధర్మాదాయ, ఇతర ట్రస్టులలో పనిచేసే ఉద్యోగులు ఈ సంక్షేమ నిధి చట్టం పరిధిలోకి వస్తారు.
ఏడాదికి ప్రతి ఉద్యోగి తన వాటాగా రూ.2, ప్రతి ఉద్యోగి తరఫున యజమాని వాటాగా రూ.5 ఈ నిధికి చెల్లించాల్సి ఉంటుంది.
 
సంక్షేమ పథకాలివే..
దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స : క్యాన్సర్, కిడ్నీ, బ్రెయిన్ ట్యూమర్, గుండె జబ్బు, పక్షవాతం, గర్భసంచి చికిత్స, ట్రామాకేర్ కింద చికిత్స పొందుతున్న కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు రూ. 20 వేల వరకు ఆర్థికసాయం అందిస్తారు. చికిత్స ప్రారంభించిన ఏడాదిలోపు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలి.
 మరణిస్తే : కార్మికుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 20 వేలు, సహజ మరణం పొందితే రూ.10 వేలు అందజేస్తారు. కార్మికుడు మరణించిన తేదీ నుంచి ఏడాదిలోపు అతని కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలి.
 
అంత్యక్రియలకు: మరణించిన కార్మికుని అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.5వేలు అందిస్తారు. కార్మికుడు మరణించిన ఆరు నెలలలోపు అతని కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలి.
అంగవైకల్యం సంభవిస్తే : ప్రమాదం కారణంగా అంగవైకల్యం సంభవించినట్లయితే రూ.20 వేలు అందజేస్తారు.
ఎయిడ్స్ చికిత్స : ఎయిడ్స్ రోగులకు రూ.20 వేలు ఆర్థికసాయం అందజేస్తారు.
వివాహ కానుక : ప్రతి ఏడాది కార్మికుని కుమార్తె(కుటుంబం లో ఒకరికి మాత్రమే), మహిళా కార్మికుల వివాహం సందర్భంగా రూ.9వేలు ఫిక్సిడ్ డిపాజిట్ రూపంలో, రూ.1000 ఖరీ దుకు మించకుండా ప్రెషర్‌కుక్కర్‌ను కానుకగా అందిస్తారు.
 
ప్రసూతి, కుటుంబ నియంత్రణ పథకం : ఈ పథకం కింద మహిళా కార్మికులకు ప్రసూతి సమయంలో రూ.5వేలు (ఇద్దరు పిల్లలకు మాత్రమే) అందిస్తారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న కార్మికులకు రూ.2వేలు అందజేస్తారు.
కార్మికుల పిల్లల చదువులకు : కార్మికుల పిల్లలు చదివే కోర్సుల ప్రకారం ఏడాదికి పదో తరగతి, ఐటీఐలకు రూ.1000, పాలిటెక్నిక్‌కు రూ.1,500, ఇంజినీరింగ్, మెడిసిన్, లా, బీఎస్సీ (అగ్రి, హార్టికల్చర్), బీఏఎంఎస్, బీడీఎస్, డీఎంఎల్‌టీ, ఎంఎల్‌టీ, బీవీఎస్సీ, బీఫార్మసీ, బీసీఏ, ఎంసీఏ, బీబీఏ, ఎంబీఏ, డీహెచ్‌ఎంఎస్ తదితర కోర్సులకు రూ.2వేలు వంతున ఉపకార వేతనాలు అందిస్తారు.
వికలాంగ విద్యార్థులకు : వికలాంగులైన విద్యార్థులకు ఏడాదికి రూ.2వేలు స్కాలర్‌షిప్‌ను అందిస్తారు.
 ఉచిత శిక్షణ: కార్మికుల కుటుంబ ఆదాయాన్ని పెంచేందుకు కుటుంబ సభ్యులకు వివిధ వృత్తులలో ఉచిత శిక్షణ ఇప్పిస్తారు.

మరిన్ని వార్తలు