సార్వత్రిక సమ్మె ప్రశాంతం

9 Jan, 2020 02:45 IST|Sakshi
బుధవారం సార్వత్రిక సమ్మె సందర్భంగా నగరంలోని ఇందిరాపార్కువద్ద బహిరంగ సభలో ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు, కార్మికులు

నిరసన ప్రదర్శనలు చేపట్టిన కార్మికులు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు బుధవారం చేపట్టిన సార్వత్రిక సమ్మె నగరంలో ప్రశాంతంగా ముగిసింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కార్మికులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ధర్నాలు నిర్వహించారు. అబిడ్స్, బ్యాంక్‌ స్ట్రీట్‌లలో వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగ సంఘాల నేతృత్వంలో భారీ ప్రదర్శన జరిగింది. ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ తదితర కార్మిక, ప్రజాసంఘాల నేతృత్వంలో నిరసన చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల సంఘాలు, జేఏసీల ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించాయి. 

డిమాండ్లు ఇవే..
కేంద్రం ప్రవేశపెట్టిన మోటారు వాహన చట్టాన్ని రద్దు చేయాలని, స్పీడ్‌ గవర్నర్స్‌ నిబంధనను ఎత్తివేయాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. అలాగే క్యాబ్‌లపైన కొద్ది సంస్థల గుత్తాధిపత్యాన్ని తొలగించి పాత పద్ధతిలో మీటర్లను తిరిగి ప్రవేశపెట్టాలని డ్రైవర్లు కోరారు. రవాణా రంగానికి చెందిన డ్రైవర్లు, కార్మికుల కోసం ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రదర్శనల్లో పాల్గొన్న కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు