జననాల నమోదు ‘డబుల్‌’ 

2 Oct, 2017 02:29 IST|Sakshi

ఈ ఏడాది 82.9 శాతం నమోదు 

పథకాల అమలులో తప్పనిసరి కావడమే కారణం 

పట్టణ ప్రాంతాల్లో వేగంగా ప్రక్రియ.. 

గ్రామీణ ప్రాంతాల్లో అంతంత మాత్రమే.. 

92.9 శాతం నమోదు హైదరాబాద్‌ తొలి స్థానం 

62 శాతంతో చివరి స్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్‌  

జననాల నమోదు శాతం భారీగా పెరిగింది. పదేళ్ల కింద 40.3 శాతం ఉండగా.. ప్రస్తుతం 82.9 శాతానికి పెరిగింది. ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమంలో జనన ధ్రువీకరణ కీలకంగా మారింది. ఆధార్‌ కార్డు వంటి వివిధ కార్డుల జారీలోనూ జనన ధ్రువీకరణ తప్పనిసరైంది. దీంతో ప్రజల్లో జనన నమోదుపై శ్రద్ధ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జననాల నమోదు పెరుగుతోందని అధికారులు 
చెబుతున్నారు. 

– సాక్షి, హైదరాబాద్‌

పట్టణాల్లోనే మెరుగ్గా.. 
జననాల నమోదులో పట్టణ ప్రాంతాల్లోనే పరిస్థితిమెరుగ్గా ఉంది. మున్సిపల్‌ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో జనన ధ్రువీకరణ పత్రాల జారీకి ప్రత్యేక వ్యవస్థ ఉండటంతో నమోదుపై ఆసక్తి పెరుగుతోంది. ఈ–సేవ, మీ–సేవ కేంద్రాల్లో వివరాలు నమోదు చేసిన పక్షం రోజుల్లో జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 92.9 శాతం జననాలు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్‌ జిల్లాలున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో అతి తక్కువగా 62.6 శాతమే నమోదయ్యాయి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో నమోదు ప్రక్రియ అంతంత మాత్రంగానే ఉంది. 

గ్రామాల్లో అయోమయం.. 
గ్రామీణ ప్రాంతాల్లో జనన ధ్రువీకరణ పత్రాల పరిస్థితి గందరగోళంగా మారింది. వాస్తవానికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే వీలుంది. అయితే ఆ పంచాయతీ కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్‌ ద్వారా పనిచేస్తే కేంద్రం రూపొందించిన జనన, మరణ నమోదు వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్న తర్వాత నిర్ణీత గడువులోగా జారీ చేయాలి. కానీ రాష్ట్రంలో మెజారిటీ గ్రామ పంచాయతీలు ఆన్‌లైన్‌ ద్వారా కాకుండా మాన్యువల్‌గానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి.దీంతో పంచాయతీల్లో జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో మీ–సేవ, ఈ–సేవ కేంద్రాల్లో జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే.. వాటిని స్థానిక రెవెన్యూ అధికారులు పరిశీలించి ‘రికార్డ్‌ నాట్‌ ఫౌండ్‌’అని పేర్కొంటూ సర్టిఫికెట్‌ ఇస్తున్నారు. కనిష్టంగా నెల రోజుల తర్వాత ఈ పత్రాన్ని జారీ చేసినప్పటికీ.. జనన ధ్రువీకరణ పత్రం ఎక్కడ పొందాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది. 

మరిన్ని వార్తలు