పౌరసత్వ సవరణ బిల్లుపై అనవసర రాద్ధాంతం

30 Dec, 2019 12:40 IST|Sakshi

బీజేపీ ఎంపీ సోయం బాపురావు

సాక్షి, ఆదిలాబాద్‌: పౌరసత్వ సవరణ బిల్లుపై కొన్ని పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు. ఆయన ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..దేశంలో ఉన్న ముస్లింలకు అన్యాయం చేసే చట్టం కాదని.. టెర్రరిస్టులకు, చొరబాటుదారులకు అందులో చోటు కల్పించలేదని వివరించారు. బిల్లును వ్యతిరేకించే వారు పాకిస్తాన్‌కు మద్దతిచ్చినట్లేనని వ్యాఖ్యానించారు. ప్రజలకు మాయామాటలు చెప్పి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ముస్లింల ఓట్లు కోసం బిల్లును టీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. హిందువులంతా ఒక్కటై మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపును మోదీకి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ‘పౌరసత్వ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు.. ఆదిలాబాద్‌ స్థానిక నేతలు పిచ్చివాళ్లలా మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు. డబ్బు కేంద్రానిది..సోకులు టీఆర్‌ఎస్‌ వాళ్లదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దన్నారు. గెలిచేవారికే మున్సిపల్‌ టికెట్లు ఇస్తామని, పైరవీకారులకు టికెట్లు ఇచ్చేదిలేదని స్పష్టం చేశారు. సర్వేలు ప్రకారమే టికెట్లు కేటాయిస్తామని బాపురావు వెల్లడించారు.

మరిన్ని వార్తలు