సరిహద్దు గ్రామం.. అభివృద్ధికి దూరం 

5 Mar, 2019 11:38 IST|Sakshi
రోడ్డుపైనే మురుగునీరు

అధ్వానంగా అంతర్గత రహదారులు

పట్టించుకోని అధికారులు

ఆందోళనలో ప్రజలు

తానూరు: మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఎల్వత్‌ గ్రామంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కనీస సౌకర్యాలైన అంతర్గత రోడ్లు, మురుగు కాలువలు లేక గ్రామస్తులు ఇ బ్బందులెదుర్కొంటున్నారు. గ్రామం మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతంలో ఉండడంతో అధికారులు అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో దశాబ్దాలుగా ఇవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇవీ సమస్యలు.. 
తానూరు మండలంలో ఉన్న ఎల్వత్‌ గ్రామం మ హారాష్ట్రకు సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర కిలోమీటరు దూరంలో ఉంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ వెళ్లి అక్కడి నుంచి ఆ గ్రామానికి వెళ్లాల్సి వస్తుంది. గ్రామంలో అంతర్గత రోడ్లు, మురుగు కాలవలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న్యూకాలనీలో మురుగు కాలువలు లేకపోవడంతో స్థానికులు వాడిన మురుగు నీరు రోడ్డుపై ప్రవహించి రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. గ్రామంలో మురుగు కాలువలు లేక పోవడంతో పాత గ్రామం నుంచి మురుగు నీరు న్యూకాలనీలో చేరుతోంది. కాలనీలో గతంలో సీసీ రోడ్డు నిర్మించిన మురుగు కా లువలు ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు వాడిన మురుగు నీరు ఇంటి పరిసర ప్రాంతంలో నిల్వ ఉంటోంది. పాలకులు మారినా తమ గ్రామంలో ఉన్న సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 మంచినీటి పథకాలు నిరుపయోగం 
ఎల్వత్‌ గ్రామంలో  గత 8 సంవత్సరాల క్రితం రూ. 23 లక్షలతో రక్షత మంచి నీటి పథకం నిర్మించి అంతర్గత పైప్‌లైన్‌ పనులు పూర్తిచేశారు. మోటారు ఏర్పాటు చేయకపోవడంతో నిర్మించిన పథకం ప్రారంభానికి నోచ్చుకోక నిరుపయోగంగా మారింది. దీంతో గ్రామస్తుల తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు పథకం ప్రారంభించి తాగు నీటి సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు.కాలనీలో ఉన్న సింగిల్‌ ఫేజ్‌ మోటారుకు పైప్‌లు ఏర్పాటు చేసుకుని నీటిని తీసుకుంటున్నారు. రూ. లక్షలు ఖర్చుచేసి నిర్మించిన పథకంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పథకం నిరుపయోగంగా మారింది. అధికారులు బోరుమోటారు ఏర్పాటు చేసి పథకం ఉపయోగంలో తీసుకువస్తే గ్రామస్తుల తాగు నీటి సమస్య పరిష్కారం అవుతుంది.

 నాసిరకంగా సీసీ రోడ్ల పనులు 
ఎనిమిది సంవత్సరాల క్రితం న్యూకాలనిలో అధికారులు రూ.లక్షలు ఖర్చుచేసి సీసీ రోడ్డు పనులను చేపట్టారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వేయడంతో  రోడ్లు పగుళ్లు తేలి, గుంతలు పడి అధ్వానంగా మారి నడవలేని స్థితిలో ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక సంబందిత కాంట్రాక్టర్‌ ఇష్టరాజ్యంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారు. సీసీ రోడ్లు నిర్మించిన అధికారులు డ్రైనేజీలు నిర్మించకపోవడంతో మురికి నీరు రోడ్డుపై పారుతోంది. ఈ విషయంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న నాథుడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా