రాయితో మోది.. మెడకు ఉరివేసి..

29 May, 2015 00:59 IST|Sakshi

చేవెళ్లరూరల్: దుండగులు ఓ గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. రాయితో మోది మెడకు ఉరివేసి చంపేశారు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన చేవెళ్లలో గురువారం వెలుగుచూసింది.
 
 పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల వెనకాల ఉన్న ఎర్రమట్టి గుంతల్లో గురువారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి(28) మృతదేహంగా పడి ఉన్నాడు. మేకల కాపరుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుండగులు వ్యక్తిని బండరాయితో మోది, గొంతు, పురుషాంగానికి వైరుతో బిగించి చంపేశారు. ముఖంపై బండరాయితో తీవ్రంగా మోదడంతో గుర్తుపట్టే వీలులేకుండా పోయింది. హతుడి ఒంటిపై డ్రాయర్ మాత్రమే ఉంది. మృతదేహం పక్కన రెండు ఖాళీ మద్యం బాటిళ్లు ఉన్నాయి. రెండు రెండు అన్నం ప్యాకెట్లు ఉన్నాయి. ఒక ప్యాకె ట్ విప్పకుండా అలాగే ఉంది. ఘటనా స్థలానికి సమీపంలో పగిలిపోయిన గాజులు కనిపించాయి.  
 
 పథకం ప్రకారం..
 గుర్తుతెలియని దుండగులు వ్యక్తిని పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.  వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
 
 ఇద్దరు వ్యక్తులు హత్యకు పాల్పడి ఉంటారని, వారిలో ఒకరు మహిళ అయి ఉంటుండొచ్చని చెప్పారు. తెలిసిన వారే వ్యక్తిని చీకట్లో ఎర్రమట్టి గుంతల్లోకి తీసుకొచ్చి మద్యం తాగించి చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్వాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంలతో వివరాలు సేకరించారు. పోలీసు జాగిలాలు ఘటనా స్థలం నుంచి శంకర్‌పల్లి రోడ్డుపై ఉన్న లేబర్ గుడిసెల వర కు వెళ్లి ఆగిపోయాయి. హతుడికి సం బంధించిన వివరాలు లభ్యం కాలేవు.
 
 ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ..
 హత్య విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హతుడి ఎవరు అనేది తెలిస్తే కేసును త్వరగా ఛేదించవచ్చని చెప్పారు. ఘటనపై ఇన్‌చార్జి సీఐ ప్రసాద్, ఎస్‌ఐలు రాజశేఖర్, ఖలీల్‌తో మాట్లాడి ఆరా తీశారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు