హ్యాపీ జర్నీ

12 Jul, 2018 12:43 IST|Sakshi

వాహన అందాలను రెట్టింపు చేస్తున్న యజమానులు 

ఆహ్లాదకర ప్రయాణానికి వివిధ రకాల సామగ్రి లభ్యం 

సౌకర్యంగా సీట్‌ బెల్ట్స్, నెక్‌ పిల్లోస్‌ 

కారు.. ఒకప్పుడు సంపన్న వర్గాల వారికి మాత్రమే అందుబాటులో ఉండేది. వివిధ కారణాల వల్ల ప్రస్తుతం ఈ కార్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నగర విస్తరణతో పాటు వ్యాపార, వాణిజ్య సామ్రాజ్యాలు నలు దిశలా వ్యాపిస్తున్నాయి. మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితికి తగిన ధరల్లో కార్లు వివిధ మోడళ్లలో అందుబాటులోకి వచ్చాయి. దానికి తోడు అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ సంస్థలు, స్టార్‌ హోటళ్లు, ప్రజలకు క్యాబ్‌ సేవలు అందుబాటులోకి రావడంతో యువత కారును ఆదాయ వనరుగా మార్చుకుంది. ఉబర్, ఓలా లాంటి సంస్థలు వేలల్లో కార్లను అద్దెకి తిప్పుతుండటంతో ఎంతో మందికి ఉపాధి దొరుకుతోంది. దాంతో కార్లను ఆకర్శణీయంగా మలుస్తున్నారు. అత్యాధునికమైన సౌకర్యాలతో విలాసవంతంగా మార్చుకుంటున్నారు.  

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో అత్యంత ఖరీదైన కార్ల షోరూంలతో పాటు వందల సంఖ్యలో వివిధ మోడళ్లకు చెందిన కార్ల షోరూమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. దానికి తగ్గట్టుగానే నిత్యం వందల సంఖ్యలో వాహనాల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. కార్లను అందంగా మలిచేందుకు వేల సంఖ్యలో కార్‌ డెకార్స్‌ షాపులు కూడా వెలిశాయి. అత్యాధునికమైన సౌకర్యాలు కల్పించేందుకు టెక్నిషియన్లు నిత్యం కృషి చేస్తున్నారు. కార్లు హుందాగా కనిపించడమే కాకుండా వాటిలో ప్రయాణం చేసేవారికి ఆహ్లాదాన్ని పంచుతున్నారు. ఇందుకు అనుగుణంగా ఫోర్‌ వీలర్స్‌ యాజమానులు తమ వాహనాలను తీర్చిదిద్దుకుంటున్నారు. డ్యాష్‌ బోర్డుపై సువాసను వెదజల్లే ఫర్‌ప్యూమ్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. వాహన యాజమానుల అభిరుచులకు తగ్గట్లు మార్కెట్‌లో వివిధ రకాల డెకరేషన్‌ వస్తువులు లభ్యవుతున్నాయి. 

సుఖవంతమైన ప్రయాణం...  
ఎక్కువ దూరం ప్రయాణించినా అలసట లేకుండా ఉండేందుకు సీట్లను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. వివిధ రకాల పూసలతో తయారు చేసిన సీట్‌ బిట్స్‌ను కార్లలో వాడుతున్నారు. ఎక్కువ దూరం ప్రయాణం చేసినా నొప్పిరాకుండా ఉండేందుకు సీట్లకు పైభాగంలో నెక్‌పిల్లోస్‌ను అమరుస్తున్నారు. సీట్‌ బెల్ట్స్‌ ధర రూ. 550, నెక్‌ పిల్లోస్‌ ధర రూ. 250 గా ఉంది. సువాసన వెదజల్లేందుకు విభిన్న కంపెనీలకు చెందిన ఫర్‌ ప్యూమ్స్‌ను వాడుతున్నారు. వీటి ధర రూ.250 నుంచి రూ.300 వరకు ఉంది. అందమైన సీట్‌ కవర్లను వేయించేందుకు కూడా ఇటీవల కాలంలో కార్లు యాజమానులు ఎక్కువ ఇష్టపడుతున్నారు. అనేక రకాల్లో ఇవి లభ్యమతున్నాయి. వీటి ధర రూ.60 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. అలాగే పాదాల కింద మెత్తగా ఉండేందుకు ఫూట్‌ మ్యాట్స్‌ ఉందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.800 నుంచి రూ.3 వేలు వరకు పలుకుతోంది. 

ఆకట్టుకునే అల్లాయ్‌ వీల్స్‌... 
ఇటీవల కాలంలో ఎక్కువ మంది కారు చక్రాలకు అల్లాయ్‌ వీల్స్‌ వాడేందుకు ఇష్టపడుతున్నారు. వీటి వల్ల కారు అందాలు రెట్టింపవుతున్నాయి. మోడల్, సైజ్‌ను బట్టి వీటి ధర రూ.25 వేల నుంచి రూ.43 వేల వరకు ఉంది. అలాగే ప్రతి వాహనానికి వీల్‌ కప్స్‌ను కూడా వినియోగిస్తున్నారు. వీటి ధర కూడా వాహనాన్ని బట్టి రూ.650 నుంచి రూ.2,400 వరకు ఉంటోంది. అలాగే ఇటీవల వస్తున్న ప్రతి కారుకు సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టమ్‌ను అమరుస్తున్నారు. దీని ధర రూ.4 వేలు. 
 
విన సొంపైన సంగీతం... 
కాస్త దూరం ప్రయాణం చేస్తే తప్పనిసరిగా మ్యూజిక్, టీవీ ఉండాల్సిందే. సోనీ, పయనీర్, జేబీఎల్, ప్యానా సౌండ్, జేవీసీ తదితర కంపెనీలకు చెందిన సౌండ్‌ సిస్టమ్స్‌ను కార్లలో అమర్చుకుంటున్నారు. వీటి ధర రూ.2 వేలు నుంచి రూ. లక్ష వరకు ఉంటుంది. అలాగే ఎడిషన్, వరల్డ్‌ టెక్, బ్లూ విజన్‌ వంటి కంపెనీలకు చెందిన స్క్రీన్‌ సిస్టమ్‌ను(టీవీ) అమర్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. వీటి ధర రూ. 5 వేలు నుంచి రూ.10 వేల వరకు ఉంది. 

డెకరేషన్‌పై ఆసక్తి చూపుతున్నారు.. 
ఇటీవల కాలంలో కార్ల డెకరేషన్స్‌పై యాజమానులు మక్కువ చూపుతున్నారు. మా వద్ద అన్ని రకాల సామగ్రి లభ్యమవుతోంది. ఎక్కువ మంది బ్రాండెడ్‌ వస్తువులనే కొనుగోలు చేస్తున్నారు. ఇవి ఎక్కువ కాలం మన్నికగా ఉండేటమేగాక, నాణ్యంగా ఉంటాయి.
– హెచ్‌ఏకే ఇమ్రోస్, ఎంఏకే కార్‌ డెకర్స్‌ అధినేత  

మరిన్ని వార్తలు