భారీ వర్షం : ప్రాజెక్టుల్లోకి పెరుగుతోన్న ఇన్‌ప్లో

12 Jul, 2018 12:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ కురుస్తున్నాయి. పశ్చిమ బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనంకు తోడు ఉపరితల ఆవర్తనంతో రెండు రాష్ట్రాలు తడిసి ముద్దవతున్నాయి. పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది.

తెలంగాణ వ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నల్గొండలోని మూసీ ప్రాజెక్టులోకి భారీ వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 645అడుగులు కాగా, ప్రస్తుతం 637 అడుగులకు చేరింది. నిర్మల్‌లోని కడెం ప్రాజెక్టులోకి భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 698అడుగులకు చేరింది. ఇప్పటికే రెండు గేట్లను ఎత్తేసి 23వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు.

నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు సాధారణ నీటిమట్టం 1091అడుగులు కాగా ఇప్పటికే 1058.08అడుగుల నీరి వచ్చి చేరింది. ఇన్‌ప్లో 1200 క్యూసెక్కులుగా ఉంది. భారీ వరద నీరుతో భద్రాద్రిలోని తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రస్తుతం దాని నీటిమట్టం 72.75క్యూసెక్కులుగా ఉంది. ఇప్పటికే రెండు గేట్లను ఎత్తేసి 1897కూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కుమరంభీంలోని కుమ్రంభీం ప్రాజెక్టు, వట్టివాగుప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరింది. గుండివాగు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం కలిగింది. 

ఆసిఫాబాద్‌లోని డోర్లీ, ఖైరిగూడ ఓపెన్‌ కాస్టులలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. జైనూర్‌ మండలం పట్నాపూరలో భారీ వర్షం కారణంగా పట్నాపూర్‌ వాగులో  ఆవుల కాపరి కొట్టుకు పోయాడు. వాగువద్ద ప్రజలు  గాలింపు చర్యలు చేపట్టారు. 

ఏపీలోనూ అదేపరిస్థితి
ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాజెక్టుల్లోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్రిడ్జ్‌ వద్ద గోదావరి మట్టం 9.3అడుగులకు చేరింది. ఇన్‌ప్లో 3,04,845క్యూసెక్కులుగా ఉంది.  4వేల క్యూసెక్కుల నీటిని డెల్టాకు విడుదల చేశారు. 

గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. విజయవాడలో ముసురు పట్టి కురుస్తున్న వాన జల్లులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మైలవరం, రెడ్డిగూడెం, బాపులపాడు, వత్సవాయి, గన్నవరం, నందిగామ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షంతో తూర్పు గోదావరిలోని ముక్తేశ్వరం, కోటిపల్లి మధ్య గోదావరిలో వేసిన మట్టబాట కొట్టుకుపోయింది. భారీవర్షాల కారణంగా గోవావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మరిన్ని వార్తలు