కాలమా ఆగిపో.. కానుకై కరిగిపో..

28 Nov, 2019 08:30 IST|Sakshi
తనతో నటించిన హీరోయిన్‌లతో మెగాస్టార్‌ చిరంజీవి స్టెప్పులు (ఫైల్‌)

రండి.. ఆనాటి స్మృతులను నెమరు వేసుకుందాం 

రీయూనియన్‌ పార‍్టీల పేరుతో భేటీ

సినీ, బుల్లితెర తారలతో పాటు యువత సైతం..  

నగరంలో నయా ట్రెండ్‌కు అన్నివర్గాలూ ఫిదా 

సాక్షి, బంజారాహిల్స్‌: ఆనాటి హృదయాల ఆనంద గీతం..ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం.. అంటూ గత స్మృతుల వెల్లువలో తడిసిముద్దవుతున్నారు. విందులు, వినోదాలతోఅపురూప క్షణాలను ఆస్వాదిస్తున్నారు.రీ యూనియన్‌ పారీ్టల పేరుతో ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా హంగామాసృష్టిస్తున్నారు. ఆనంద సంద్రంలోఓలలాడుతున్నారు. జ్ఞాపకాల దొంతరలో దోబూచులాడుతున్నారు. కాలమా ఆగిపో.. కానుకై కరిగిపో అంటూ ఒకప్పటిముచ్చట్లను యాది చేసుకుంటున్నారు. గుర్తుకొస్తున్నాయి.. అంటూ గుండె గూటిని తడిమి చూసుకుంటున్నారు. సినీ నటులతో పాటు బుల్లితెర నటులు, సిటీ యూత్‌ సైతం తమదైన శైలిలో నయా ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు.    

చిరంజీవి ఇంట్లో సందడి..
నాలుగు రోజుల క్రితం మెగాస్టార్‌ చిరంజీవి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం– 25లోని తన నివాసంలో జరిపిన రీ యూనియన్‌ పార్టీ అందరినీ ఆకర్షించింది. 1980 ప్రాంతంలో తనతో కలిసి నటించిన నటీనటులను నగరానికి రప్పించి ఈ వేడుకను అత్యంత ఘనంగా ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ఈ నటులంతా ఒక్కొక్కరి ఆతిథ్యంలో రీ యూనియన్‌ పార్టీలు జరుపుకుంటుండగా ఈసారి చిరంజీవి ఆతిథ్యం ఇచ్చారు. ఆయనతో నటించిన సుహాసిని, రాధ, సుమలత, రాధిక, కుష్బూ, నాగార్జున, జయసుధ, సుమన్, మోహన్‌లాల్, వెంకటేశ్, జగపతిబాబు, నరేశ్, శోభన, జయప్రద, రేవతి, అమల తదితరులు హాజరయ్యారు. సినీ సందడి నెలకొంది.

ఇక బిగ్‌బాస్‌ సీజన్‌– 3లో పాల్గొన్న హౌస్‌మేట్స్‌ అంతా ఇటీవల శామీర్‌పేటలోని ఓ రిసార్ట్‌లో సందడి చేశారు. పునర్నవి, మహేశ్, అలీ రెజా, వితికా, వరుణ్‌ సందేశ్‌ తదితరులు ఆటా పాటలతో ఆకట్టుకున్నారు. సరికొత్తగా కనిపించేందుకు వీరి వేషధారణ అలరించింది. ఇక హౌస్‌ఫుల్‌ అనే సినిమా చిత్ర నిర్మాణ సమయంలో తనతో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులతో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ ఇటీవలనే హైదరాబాద్‌లో రీ యూనియన్‌ పార్టీ ఘనంగా నిర్వహించారు.

రీయూనియన్‌ పార్టీలో హీరో రామ్‌చరణ్‌తేజ్, రాధిక, శరత్‌కుమార్‌ (ఫైల్‌)

ఒకే పాఠశాలలో..
ఒకే  కళాశాలలో చదువుకునే విద్యార్థులు ఆ బ్యాచ్‌ను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసుకుని కొన్నేళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతో ఒకే వేదికపై కలిసి మధుర స్మృతులను నెమరు వేసుకోవడం విదితమే. తరచూ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు కూడా జరుగుతూనే ఉంటాయి. విందులు, వినోదాలతో ఈ కార్యక్రమాలు అత్యంత ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకుంటూ తమ స్నేహాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఐతే ఒకే చోట పనిచేసిన వారంతా ఇప్పుడు ‘రీ యూనియన్‌ పార్టీ’ పేరుతో కలుసుకుంటూ కొత్త ట్రెండ్‌కు తెరతీశారు.  నాలుగైదేళ్లుగా నగరంలో ఈ సంస్కృతి విస్తరిస్తోంది. ఒకేచోట పనిచేసిన ఉద్యోగులైనా, సాంకేతిక నిపుణులైనా, సినీ నటులు ఇలా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కేవలం సంపన్న వర్గాలకు, సినీ పరిశ్రమకు పరిమితమైన రీ యూనియన్‌ పారీ్టలు ఇప్పుడు మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి ఉద్యోగులు కూడా నిర్వహించుకుంటున్నారు. బంధుమిత్రులు కూడా తరచూ రీయూనియన్‌ పారీ్టల పేరుతో సందడి చేస్తున్నారు.

ఆటపాటలతో.. 
అందరూ కలుసుకోగానే కేవలం ముచ్చట్లతోనో, భోజనాలు చేస్తునో గడిపేస్తుంటారు. రీ యూనియన్‌ పారీ్టలో మాత్రం ఆటపాటలకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. జోక్‌లతో పాటు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలనాటి పాటలపై డ్యాన్స్‌ చేస్తారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ పారీ్టలు జరుగుతాయి. ఆనాటి ముచ్చట్లను నెమరువేసుకుంటూ అప్పటి హిట్‌ పాటలపై డాన్సులు చేస్తూ చక్కని ఆతిథ్యాన్ని స్వీకరిస్తుంటారు.
 
సహచర నటులు, సినీ సాంకేతిక నిపుణులతో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌
ఐటీ ఉద్యోగులు.. యువ పారిశ్రామికవేత్తలు
కేవలం సినీతారలే కాకుండా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, యువ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కిట్టీ పారీ్టలు నిర్వహించుకునే మహిళలు కూడా ఇటీవల రీ యూనియన్‌ పారీ్టలు నిర్వహించుకుంటున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, గచ్చిబౌలీ, మణికొండ, మాదాపూర్, కొత్తగూడ, కూకట్‌పల్లి, హిమాయత్‌నగర్, బేగంపేట, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లోని హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు రీ యూనియన్‌ పార్టీలకు ఇటీవల వేదికగా నిలుస్తున్నాయి. ఇక శివార్లలోని రిసార్ట్స్‌లో, ఫామ్‌హౌస్‌లలో ఈ పారీ్టలు జోరుగా సాగుతున్నాయి. ఒకే చోట పనిచేసిన ఉద్యోగులు లేదా ఒకే చోట శిక్షణ తీసుకున్న వ్యాపార, పారిశ్రామికవేత్తలు సైతం ఇలా కలుసుకుంటూ జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు.

డ్రెస్‌కోడ్‌ ప్రత్యేక ఆకర్షణ.. 
రీ యూనియన్‌ పారీ్టకి డ్రెస్‌కోడ్‌ను ముందుగానే సభ్యులకు తెలియజేస్తారు. చిరంజీవి ఇంట్లో జరిగిన పారీ్టకి నలుపు రంగు డ్రెస్‌కోడ్‌తో వచ్చారు. ప్రతి ఒక్కరూ ఆ రోజు నలుపు రంగు దుస్తులతో పాటు ఆభరణాలు కూడా అదే రంగువి వేసుకుంటారు. ఇక ప్రత్యేక ఆకర్షణగా రకరకాల టోపీలు, గొలుసులు, ఇతర ఆభరణాలు ధరిస్తారు. బిగ్‌బాస్‌– 3 రీ యూనియన్‌ పారీ్టకి పింక్‌ కలర్‌ దుస్తులను ధరించారు.

రీ యూనియన్‌ పార్టీలో సందడి చేస్తున్న బిగ్‌బాస్‌– 3 హౌస్‌మేట్స్‌

యువ నటులు సైతం.. 
కేవలం చిరంజీవి, జగపతిబాబు, సుమన్, కమల్‌హాసన్‌ తదితర హీరోల నాటి రోజులే కాకుండా నేటితరం యువ హీరో హీరోయిన్లు కూడా తరచూ ఏదో ఒక పబ్‌లోనో, రిసార్ట్‌లోనో, స్టార్‌హోటల్‌లోనో కలుసుకుంటున్నారు. రీ యూనియన్‌ పార్టీ పేరుతో హీరో హీరోయిన్లంతా ఆయా చిత్రాల నిర్మాణ సమయంలో తమ అనుభూతులను పంచుకుంటున్నారు. జూనియర్‌ ఎనీ్టఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, మంచు మనోజ్, రానా తదితరులు తరచూ సమావేశమవుతుంటారు.


 

మరిన్ని వార్తలు