గడువులోగా పట్టాలెక్కించండి

26 Jul, 2014 08:48 IST|Sakshi
గడువులోగా పట్టాలెక్కించండి

* మెట్రోపై రాష్ట్ర ప్రభుత్వం, ఎల్ అండ్ టీ, హెచ్‌ఎంఆర్‌లకు కేంద్రం ఆదేశం
* పీపీపీ విజయవంతమైతే మరో 14 నగరాల్లో ఇదే విధానంలో మెట్రోలు
* మెట్రో పనుల పురోగతిపై సమీక్ష
* ఇక అలైన్‌మెంట్ మార్పు లేనట్టే?
* ఆగస్టులో ట్రయల్ రన్‌కు సన్నాహాలు!

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రూపురేఖలు మార్చనున్న ఎలివేటెడ్ మెట్రోరైలు ప్రాజెక్టును 2017 జనవరి 1 నాటికి పూర్తి చేయాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వం, హెచ్‌ఎంఆర్ (హైదరాబాద్ మెట్రో రైల్), ఎల్‌అండ్‌టీ సంస్థలను ఆదేశించింది. దేశంలో తొలిసారిగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ విధానం) చేపడుతున్న నగర మెట్రో ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారాం శుక్రవారం ఢిల్లీలోని ఆర్థిక శాఖ కార్యాలయంలో సమీక్షించారు. పీపీపీ విధానంలో చేపడుతున్న నగర మెట్రో ప్రాజెక్టు విజయవంతమైతే దేశవ్యాప్తంగా మరో 14 నగరాల్లో మెట్రో ప్రాజెక్టులను ఇదే విధానంలో పూర్తిచేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని చెప్పారు. నగర మెట్రో ప్రాజెక్టుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నట్లు పేర్కొన్నారు.
 
  మెట్రో పనుల పురోగతిపై ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్ విభాగాల ఉన్నతాధికారులు ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌పై ఆయన సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాగా నాగోల్-శిల్పారామం, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా మూడు రూట్లలో ముందుగా సిద్ధంచేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఆధారంగానే పూర్తిచేయాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా సుల్తాన్‌బజార్, మొజంజాహీ మార్కెట్, అసెంబ్లీ, గన్‌పార్క్ ప్రాంతాల్లో భూగర్భ మెట్రో మార్గం ఏర్పాటుపై పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఎల్‌అండ్‌టీని కోరిన నేపథ్యంలో కేంద్రం పైవిధంగా స్పందించడం గమనార్హం. తాజా సమావేశం నేపథ్యంలో మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పులు లేనట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ఎల్‌అండ్‌టీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  
 
 ట్రయల్ రన్‌కు ముఖ్యఅతిథిగా మోడీ
 నాగోల్-మెట్టుగూడ (8 కి.మీ.) రూట్లో ఆగస్టు తొలివారంలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్ అధికారులు ఆర్థిక శాఖ కార్యదర్శికి తెలిపినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ రూట్లో మెట్రో రైళ్లు పరుగులు తీసేందుకు అవసరమైన ట్రాక్, సిగ్నలింగ్, మెట్రో రైలుకు కావాల్సిన విద్యుత్ లైన్లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నట్లు ఆయనకు వివరించినట్లు తెలిసింది.
 
 ఇదీ నగర మెట్రో కథాకమామిషు
 నగర మెట్రో ప్రాజెక్టుకు అయ్యే అంచనా వ్యయంలో.. ఎల్‌అండ్‌టీ సంస్థ రూ.12,674 కోట్లు, కేంద్రం సర్దుబాటు నిధి కింద రూ.1,458 కోట్లు కేటాయించనున్నాయి. భూసేకరణ, స్థిరాస్తులు కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లింపు, పునరావాసం, స్కైవాక్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1,980 కోట్లు వెచ్చించనుంది. ఈ ప్రాజెక్టు పనులు 2012 మేలో మొదలయ్యాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం మూడు కారిడార్లలో 72 కి.మీ. మేర పనులను జనవరి 1,2017 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే ఆయా రూట్లలో పనులు ఊపందుకున్నాయి. ఉప్పల్, మియాపూర్ మెట్రో డిపోల్లో ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. మూడు కారిడార్లలో మెట్రో ప్రాజెక్టు పూర్తయితే నిత్యం సుమారు 20 లక్షల మంది ప్రయాణికులకు ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. సుమారు 50 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందని హెచ్‌ఎంఆర్ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు