రైతును దగా చేస్తే.. లైసెన్స్‌ రద్దు!

29 Apr, 2017 01:23 IST|Sakshi
రైతును దగా చేస్తే.. లైసెన్స్‌ రద్దు!

వ్యాపారుల ట్రేడ్‌ లైసెన్సుల రద్దుకు సర్కారు యోచన
ప్రభుత్వ ధరలకే పంటలు అమ్ముకునేలా చట్టం?
ఖమ్మంలో మిర్చి రైతు దగాపై నివేదిక కోరిన సీఎం


సాక్షి, హైదరాబాద్‌: రైతుకు గిట్టుబాటు ధర రాకుండా అడుగడుగునా దోపిడీ చేస్తున్న వ్యాపారులపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. అవసరమైతే బాధ్యులైన వ్యాపారుల ట్రేడ్‌ లైసెన్సులు రద్దు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు త్వరలో తీసుకురాబోయే మార్కెటింగ్‌ చట్టంలో కొత్త అంశాలు జోడించాలని భావిస్తోంది. ఇప్పటికే నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం తయారుచేసిన చట్టంలో అదనంగా కొత్త అంశాలు జోడించి పకడ్బందీగా తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. వచ్చే ఏడాది నుంచి గ్రామ రైతు సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మార్కెటింగ్‌ చట్టం ఆ మేరకు రైతుకు ఉపయోగపడేలా ఉండాలని తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త మార్కెటింగ్‌ చట్టం ప్రకారం గ్రామ, మండల, జిల్లా రైతు సంఘాలు కలసి ఇతర ప్రాంతాల్లో పంటను విక్రయించి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తాయి.

ఎక్కడా ధర లేకపోతే గోదాముల్లో నిల్వ ఉంచి ధర వచ్చాకే విక్రయించేలా ఏర్పాట్లు చేస్తారు. వచ్చే ఏడాది నుంచి ఇటువంటి భూమిక ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మరోవైపు నకిలీ విత్తన నిరోధక, పరిహార చట్టాన్ని త్వరలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ముసాయిదా బిల్లు సిద్ధమైంది. కంపెనీలు నకిలీ విత్తనాలు అమ్మితే సంబంధిత యజమానిని జైలుకు పంపిస్తారు. రైతుకు కంపెనీ నుంచి పరిహారం ఇప్పిస్తారు. ఈ బిల్లును ఇప్పటికే న్యాయశాఖ పరిశీలనకు పంపించారు. కేబినెట్‌ ఆమోదం తర్వాత శాసనసభలో బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది.

అకస్మాత్తుగా ధర ఎందుకు తగ్గింది?
కొద్ది రోజులుగా రూ. 6 వేల దాకా క్వింటాల్‌ మిర్చిని కొనుగోలు చేసిన వ్యాపారులు...శుక్రవారం ఖమ్మంలో అకస్మాత్తుగా 50–60 శాతం మధ్య ధరలు తగ్గించడం వెనుక కుట్ర దాగి ఉందేమోనని ప్రభుత్వం అనుమానిస్తోంది. శుక్రవారం ఖమ్మం మార్కెట్‌లో మిర్చిని రూ.2,500 నుంచి రూ.4,500 వరకే కొనుగోలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ నుంచి నివేదిక కోరింది. దళారుల ప్రమేయంపైఖమ్మం మార్కెట్‌ యార్డులో విధ్వంసం వెనుక ఉన్న వారి వివరాలు తెలుసుకోవాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఒక రాజకీయ పార్టీ పథకం ప్రకారం రైతులను రెచ్చగొట్టడం వల్లే విధ్వంసం చోటుచేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే తక్కువ ధరకు మిర్చి కొనుగోలు చేస్తున్న వ్యాపారులను కట్టడి చేయడంలో విఫలమైన మార్కెటింగ్‌ అధికారులపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

మిర్చి రైతుల హాహాకారాలు...
ఊహించని రీతిలో మిర్చి ధర పడిపోవడంతో రైతులు హహకారాలు పెడుతున్నారు. ప్రస్తుతం క్వింటాలుకు సగటున రూ. 4,500 ధర మించడం లేదు. నాణ్యత లేదంటూ కొన్నిచోట్ల రూ. 3 వేలకు మించి కొనుగోలు చేయడం లేదు. తక్కువ ధరపై రైతులు ప్రశ్నిస్తే కొనుగోలు చేయకుండా వ్యాపారులు సతాయిస్తున్నారు. వాస్తవంగా సీజన్‌ ప్రారంభంలో మిర్చి ధర కొంతలో కొంత బాగుంది. జనవరి నుంచి ధర పతనం మొదలైంది. ఫిబ్రవరిలో దాదాపు రూ. 1,500 తగ్గింది. ఇక పంట ఉత్పత్తి అధికంగా ఉండే మార్చి, ఏప్రిల్‌లలో అనూహ్యంగా ధర పతనమైంది. గత నెల మొదట్లో రూ. 8 వేలకు పడిపోయింది. మార్చి రెండో వారం నుంచి రూ. 5 వేలకు పడిపోయింది. ఇప్పుడు రూ. 4,500కు పడిపోయింది.

ప్రస్తుతం రోజుకు కొంత చొప్పున ధర పడిపోతోంది. రైతుకు ఎకరా పంట సాగు కోసం కోతకు రూ. లక్షన్నర వరకు ఖర్చవుతుంది. ధరల పతనంతో మిర్చి రైతులు హాహాకారాలు చేస్తున్నారు. కొన్ని మార్కెట్లలో మిర్చిని కాలబెడుతున్నారు. ఇంత జరుగుతున్నా మిర్చి కొనుగోలుకు అనుమతిచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి లేఖ రాసినా ఆ శాఖ డైరెక్టర్‌ ఢిల్లీకి వెళ్లి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు మిర్చి రైతులకు క్వింటాలుకు రూ. 1,500 బోనస్‌ ఇవ్వాలని తెలంగాణ మార్కెటింగ్‌ శాఖ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించడం తెలిసిందే.

మరిన్ని వార్తలు