రియల్‌ టోకరా

14 Mar, 2018 06:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భూమి కొంటే ఉద్యోగమంటూ మాయమాటలు 

ప్లాట్లు విక్రయించి రూ.2.04కోట్లు స్వాహా.. 

‘అవార్డు ఎంక్వైరీ’లో వెలుగు చూసిన వైనం

లబోదిబోమంటున్న పలువురు బాధితులు

సత్తుపల్లి: ఓపెన్‌కాస్టులో భూమిని కోల్పోతే.. బదులుగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. పునరావాసం కింద ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తిస్తుంది.. ఇళ్ల స్థలంతోపాటు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇస్తారు. ఇదంతా నూతన భూ సేకరణ చట్టంలోనే ఉంది. ఉద్యోగం ఇవ్వనిపక్షంలో బాధితులు కోర్టును ఆశ్రయించవచ్చు. తీర్పు మేరకు సింగరేణి యాజమాన్యం చేపట్టనున్న ప్రాజెక్టు పనులు నిలిచిపోతాయి. దీంతో యాజమాన్యం దిగొచ్చి డిమాండ్లు తీరుస్తుంది.

200 గజాల స్థలం రూ.3లక్షలకు తీసుకుంటే.. పైన చెప్పినవన్నీ వర్తిస్తాయంటూ.. ఓ రియల్టర్‌ మాయమాటలతో నమ్మించగా.. అక్షరాల రూ.2.04కోట్లు బాధితులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇదంతా సత్తుపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన ‘అవార్డు ఎంక్వైరీ’లో వెలుగు చూసింది. ఒక రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు తన కొడుకు భవిష్యత్‌ కోసం రిటైర్మెంట్‌ సొమ్ములో నుంచి రూ.3లక్షలు చెల్లించి.. 200 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. కొడుకుకు ఉద్యోగం వస్తుందనే ఆశతో స్థలం కొన్నట్లు చెప్పడంతో అధికారులు విస్తుపోయారు.  

కిష్టారం ఓపెన్‌కాస్టులో..  
ఓపెన్‌ కాస్టు వల్ల సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీ పరిధిలోని జగన్నాథపురం గ్రామం మొత్తం కనుమరుగవుతోంది. ఐదారేళ్ల నుంచి భూ సేకరణపై రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దీనికి అనుగుణంగా పలు దఫాలుగా గ్రామసభలు నిర్వహించారు. కిష్టారం ఓపెన్‌కాస్టులో జగన్నాథపురం రెవెన్యూలోని పట్టా భూమి 91.08 ఎకరాలు, అసైన్డ్‌ భూమి 178 ఎకరాలు, ఇళ్ల స్థలాలు 21 ఎకరాలు పోతున్నాయి. దీంతో 154 మంది నిర్వాసితులవుతున్నారు.  

రూ.37.50లక్షల పెట్టుబడి..రూ.2.04కోట్లు రాబడి.. 
జగన్నాథపురంలోని సర్వే నంబర్‌ 65లో గల 3.15 ఎకరాల వ్యవసాయ భూమిని రూ.37.50లక్షలకు 2015, సెప్టెంబర్‌లో చిలుకూరి జగన్మోహన్‌రెడ్డి వద్ద నుంచి ఖమ్మంకు చెందిన ఎస్‌కే.నాగుల్‌మీరా 1.27 ఎకరాలు, అలవాల నాగబ్రహ్మాచారి 35 కుంటలు, అబ్దుల్‌ మజీద్‌ 35 కుంటల చొప్పున కొనుగోలు చేసి.. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. తర్వాత ఆ భూమిని 200 గజాల చొప్పున 68 ప్లాట్లుగా విభజించి.. ఒక్కో ప్లాటు రూ.3లక్షల చొప్పున అమ్మేశారు. మొత్తం 68 ప్లాట్లు అమ్మి.. రూ.2.04కోట్లు సొమ్ము చేసుకున్నారు.

        కాగితాలపై వేసిన లేఅవుట్‌
 
అంతా కాగితాలపైనే.. 
జగన్నాథపురం సర్వే నంబర్‌ 65లోని 3.17 ఎకరాల వ్యవసాయ భూమిని వాణిజ్య భూమిగా బదలాయించకుండా.. ఎటువంటి లే అవుట్‌ లేకుండానే అంతా కాగితాలపైనే ప్లాన్లు చూపించి.. భూమిని అమ్మినట్లు బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అందులో జామాయిల్‌ తోట ఉన్నట్లు రికార్డుల్లో నమోదై ఉంది. అదీకాక ఊరికి 2 కిలోమీటర్ల దూరం.. చెరువుకు ఆనుకొని ఉన్న భూమిలో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ చేసినట్లు చూపించి.. టోకరా వేసినట్లు బాధితులు రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకున్నారు.

 జగన్నాథపురం గ్రామం

200 గజాల రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లను అధికారులకు చూపించి.. మా భూమిని నమోదు చేసుకోవాల్సిందిగా పత్రాలను అందించారు. అయితే అది వాస్తవంగా వ్యవసాయ భూమి కావడంతో పరిహారం కింద ప్రభుత్వం ఎకరాకు రూ.12లక్షల నుంచి రూ.15లక్షలు ఇచ్చే అవకాశం ఉంది. 200 గజాలకు పరిహారం కేవలం రూ.50వేల నుంచి రూ.62వేల వరకే వస్తుంది. అయితే రూ.3లక్షల చొప్పున కొనుగోలు చేసిన తాము 200 గజాల ప్లాటుకు రూ.2.38లక్షల నుంచి రూ.2.50లక్షల వరకు నష్టపోయే అవకాశం ఉందని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.

వ్యవసాయ భూమిగానే పరిగణిస్తాం..  
జగన్నాథపురం సర్వే నంబర్‌ 65లోని 3.17 ఎకరాలను వ్యవసాయ భూమిగానే పరిగణిస్తున్నాం. అందులో 200 గజాల చొప్పున ప్లాట్లు చేసి.. విక్రయించినట్లు వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేశాం. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించాం. చెరువు సమీపంలో ఉన్న ఆ భూమిలో జామాయిల్‌ తోట ఉంది. వ్యవసాయ భూమికి వచ్చిన పరిహారమే దీనికి అందుతుంది. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలు వర్తించవు. 200 గజాల చొప్పున కొన్నట్లు ఇప్పటికే 20 మంది వరకు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకున్నారు. 3.17 ఎకరాలకు సంబంధించిన లావాదేవీలపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. 
– టీఏవీ.నాగలక్ష్మి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌


 

మరిన్ని వార్తలు