చెడ్డీగ్యాంగ్‌ హల్‌చల్‌

4 Jun, 2019 12:07 IST|Sakshi
చెడ్డీగ్యాంగ్‌ ధ్వంసం చేసిన ఇంటి తలుపు

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలో చెడ్డీ గ్యాంగ్‌ మరోమారు హల్‌చల్‌ చేసింది. ముబారక్‌నగర్‌ శివారు ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి చోరీకి యత్నిం చింది. ఈ ముఠా సుమారు దాదాపు గంట పాటు ఓ ఇంట్లో కలకలం రేపింది. మామ, అల్లుడు అడ్డుకునేందుకు యత్నించగా దాడికి తెగబడింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. మాక్లర్‌ మండలం సింగంపల్లి తండాకు చెందిన తోలియ.. నగరంలోని ఆదర్శనగర్‌లో గల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయన నెల రోజుల క్రితమే ముబారక్‌నగర్‌ ప్రాంతంలోని పెద్దమ్మ ఆలయ సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. చుట్టుపక్కల పెద్దగా ఇళ్లు లేవు. తోలియా, అతని భార్య సవిత, ఇద్దరు పిల్లలతో పాటు అత్తమ్మ చంద్రకళ, మామ గోపి సోమవారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. అయితే, అర్ధరాత్రి 2 గంటల సమయంలో నలుగురు సభ్యులు గల చెడ్డీ గ్యాంగ్‌ తోలియా ఇంటికి చేరుకుంది. చెడ్డీలు, బనియన్లు వేసుకుని వచ్చిన దుండగులు తలుపులు కొడుతూ తెరవాలని అరుస్తూ హల్‌చల్‌ చేసింది. ఈ అలజడితో మెలకువ వచ్చిన తోలియా, అతని మామ గోపి హాల్‌లోకి వచ్చి చూసే సరికి దొంగలు బయట తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

దీంతో మామ, అల్లుడు కలిసి తలుపులు తెరుచుకోకుండా అడ్డుగా నిలబడ్డారు. దీంతో దొంగలు పెద్ద బండరాయితో తలుపును బద్దలు కొట్టి, కిటికీలను ధ్వంసం చేశారు. కర్రలతో కిటికీల నుంచి మామ అల్లుళ్లపై దాడికి పాల్పడ్డారు. అయినా కూడా వారిద్దరు ధైర్యంగా డోర్‌కు అడ్డంగా నిలబడ్డారు. దాదాపు 45 నిమిషాల పాటు చోరుల ప్రయత్నాన్ని వారు నిలువరించారు. ఇదే క్రమంలో తోలియా ‘100’కు ఫోన్‌ చేయడంతో రూరల్‌ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు వస్తున్నట్లు గుర్తించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వెళ్తూ వెళ్తూ పగిలిన అద్దం ముక్కలు విసరడంతో గోపిని నుదిటిపై గాయమైంది. వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గాయపడిన గోపి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మామ, అల్లుడు అడ్డుకోక పోతే ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగేదని కుటుంబ సభ్యులు వాపోయారు.

గతంలోనూ కలకలం.. 
చెడ్డీ గ్యాంగ్‌ గతంలోనూ జిల్లాలో పలుమార్లు పంజా విసిరింది. వినాయక్‌నగర్‌లో అర్ధరాత్రి ఓ అపార్టమెంట్‌లోకి ప్రవేశించి, చోరీకి యత్నించారు. వినాయక్‌నగర్‌లోనే మరో ప్రాంతంలో దొంగతనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ప్రయత్నంలో ఓ కానిస్టేబుల్‌ చేతి వేలు తెగి పోయింది. అలాగే కామారెడ్డిలో చోరీకి పాల్పడి పారిపోతూ, జిల్లా కేంద్రంలోని సుభాష్‌ నగర్‌లోనూ దొంగతనానికి యత్నించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో చెడ్డీగ్యాంగ్‌ సభ్యులు పరారయ్యారు. ఏటా చెడ్డీగ్యాంగ్‌ జిల్లా కేంద్రంలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌ విసురుతోంది.

పెట్రోలింగ్‌ కరువు.. 
జిల్లా కేంద్రానికి మహారాష్ట్ర సరిహద్దు దగ్గరగా ఉండడంతో, ఆ ప్రాంతానికి చెందిన దొంగల ముఠాలు తరచూ జిల్లాలో పంజా విసురుతున్నాయి. షెట్టర్‌ గ్యాంగ్, చెడ్డీ గ్యాంగ్‌ తదితర ముఠాలు మధ్యాహ్నం వేళ రెక్కీ నిర్వహించి రాత్రి వేళలో దొంగతనాలకు పాల్పడుతున్నాయి. నరగంలో వరుస చోరీలు జరుగుతున్నా పోలీసుల్లో పెద్దగా స్పందన కరువైంది. దొంగతనాల నివారణపై ప్రత్యేక కార్యాచరణ కొరవడింది. అన్ని ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ చేయడం లేదు. పోలీసులు ఎన్నికల హడావుడిలో, బందోబస్తు విధుల్లో ఉండడం, పెట్రోలింగ్‌ తగ్గడంతో దొంగలు తప పని కానిచ్చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా