అన్యాయం చేశారు!

7 Dec, 2019 03:24 IST|Sakshi
చెన్నకేశవులు భార్య రేణుక

ఎన్‌కౌంటర్‌పై మృతుల తల్లిదండ్రుల మండిపాటు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘దిశ’కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై మృతుల తల్లిదండ్రుల ఆవేదన ఇది. తమ బిడ్డలు చేసిన పని తప్పేనని, వారికి శిక్ష వేయాల్సిందే అని పేర్కొంటున్న నిందితుల తల్లిదండ్రులు.. ఇంత తొందరగా ఇలాంటి శిక్ష పడుతుందని ఊహించలేదని చెబుతున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం జక్లేర్‌కు చెందిన మహమ్మద్‌ ఆరిఫ్, గుడిగండ్ల గ్రామానికి చెందిన జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును శుక్రవారం ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలుసుకున్న ఆయా గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.

వారంతా దిశకు న్యాయం జరిగిందని చెబుతూనే.. మృతులంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారని, తల్లిదండ్రులకు వారే దిక్కని, ఎన్‌కౌంటర్‌తో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డా యని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్‌ చేసిన తర్వాత ఒక్కసారి కూడా మాట్లాడనీయ కుండా ఇలా ఎన్‌కౌంటర్‌ చేయడం దారుణమని మృతుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మరోవైపు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మృతుల తల్లిదండ్రులను వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు ఓదార్చారు. వారికి ఎన్‌కౌంటర్‌ స్థలానికి పంపించారు.

మా పొలంలో పూడ్చొద్దు..  
ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారిని ఖననం చేసేందుకు శుక్రవారం సాయంత్రమే ఏర్పా ట్లు చేశారు. అయితే గుడిగండ్లకు చెందిన నిందితుడు చెన్నకేశవులును శ్మశానవాటికలో ఖననం చేసేందుకు సన్నద్ధమవుతుండగా.. తన పొలానికి దగ్గరగా పూడ్చొద్దంటూ మ్యాకల వెంకటమ్మ స్పష్టంచేశారు. ఆమె పొలానికి ఆనుకుని ఉన్న శ్మశానవాటికలోనే మృతులందరినీ పూడుస్తున్నామని చెప్పినా.. ఆమె అంగీకరించలేదు. దీంతో వెంకటమ్మ పొలానికి దూరంగా మృతదేహాలను ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు చెన్నకేశవులు మృతదేహాన్ని తమకే అప్పగించాలని తల్లి జయమ్మ, భార్య రేణుక, బంధువులు, కుటుంబ సభ్యులు ప్రధాన రహదారిపై ధర్నా చేశారు.

‘‘కోర్టు తీర్పు రాకముందే మా ఆయన్ను చంపడం పెద్ద తప్పు.. ఇది అన్యాయం.. నన్నూ తీసుకెళ్లి అక్కడే చంపండి’’ – చెన్నకేశవులు భార్య రేణుక

‘‘తప్పు చేసిన మా కొడుకుకు శిక్ష వేయడం కరెక్టే. ఇకపై తెలంగాణలో ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా ఇలాగే కాల్చి చంపుతారా? పోలీసులు సమాధానం చెప్పాలి. ఇప్పుడు నా కోడలు కడుపుతో ఉంది. ఒక్కసారి కూడా మాట్లడనివ్వకుండా చంపడం సరైంది కాదు’’ – చెన్నకేశవులు తల్లి జయమ్మ

‘‘కనీసం మాకు చెప్పకుండానే, కోర్టులో శిక్ష పడకుండానే పోలీసులు ఎలా ఎన్‌కౌంటర్‌ చేశారో సమాధానం చెప్పాలి’’ – మహమ్మద్‌ ఆరిఫ్‌ తల్లి మౌలానాబీ

‘‘మా కొడుకును ఒక్కసారి చూడకుండా మాట్లాడకుండా ఇలా చంపేయడం కరెక్ట్‌ కాదు. తప్పు చేస్తే శిక్షించమన్నాం. ఇంత తొందరగా ఇలా చంపుతారని అసలే అనుకోలేదు. మా కొడుకు శవం మాకొద్దు’’ – శివ తల్లిదండ్రులు మణెమ్మ, రాజప్ప

‘‘నా కొడుకును చూడకుండానే చంపేశారు.. కడ చూపుకైనా కనికరించ లేదు..’’ – నవీన్‌ తల్లి లక్ష్మి

మృతుల దేహాల్లో 11 బుల్లెట్లు!
ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మహమ్మద్‌ ఆరిఫ్‌ (ఏ–1) శరీరంలో నాలుగు బుల్లెట్లు, జొల్లు శివ (ఏ–2) శరీరంలో మూడు, జొల్లు నవీన్‌ (ఏ–3) శరీరంలో మూడు, చెన్నకేశవు లు (ఏ–4) శరీరంలో ఒక బుల్లెట్‌ను వైద్యాధికారుల బృందం గుర్తించినట్లు సమాచారం. సంఘటనా స్థలంలో పోలీసులు 15 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఇం దులో పలు బుల్లెట్లు మిస్‌ ఫైర్‌ కాగా.. 11 బుల్లెట్లు నిందితుల శరీరంలోకి చొచ్చుకుని పోయాయని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు