100 జేఏసీలు పుట్టుకొస్తాయి

8 Jun, 2016 04:00 IST|Sakshi
100 జేఏసీలు పుట్టుకొస్తాయి

తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్
హైదరాబాద్: ఉద్యమకారుల గొంతు నొక్కాలని చూస్తే ఉద్యమంలో మాదిరిగా 100 జేఏసీలు పుట్టుకొస్తాయని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ అన్నారు. రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై సీఎం కేసీఆర్ కుటుంబం, మంత్రివర్గ సభ్యులు తిట్లదండకం ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా తెలంగాణ ప్రజల కోసం గొంతు విప్పడానికి ప్రయత్నిస్తే కేసీఆర్ అనుచరగణం ఒంటికాలిపై లేస్తున్నదని విమర్శించారు.

ఉద్యమకారులను సన్నాసులు, దద్దమ్మలు అంటున్నారని, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కొత్త బిచ్చగాడు అని అంటున్నారని, ఇదెక్కడి సంస్కారమని ప్రశ్నించారు. తలసాని కూడా కోదండరాంను విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అవసరం వచ్చిందని, ఇప్పటికైనా కోదండరాం దానిని తయారు చేయాలని సుధాకర్ సూచించారు. తెలంగాణ కోసం పోరాడిన కవులు, క ళాకారులు, ఉద్యమకారులు, మేధావివర్గం అందరూ ఐక్యంకావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ద్రోహులంతా బజారుకెక్కి ఉద్యమకారులపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

మరిన్ని వార్తలు