చికెన్‌ @ రూ.270

17 Jun, 2019 09:19 IST|Sakshi

రికార్డు స్థాయికి చికెన్‌ ధరలు  

డిమాండ్‌కు తగిన సరఫరా లేకే ఇబ్బంది

రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం

సాక్షి, సిటీబ్యూరో: ఆదివారం వచ్చిందంటే మాంసాహార ప్రియులకు కోడి కూర వండందే ముద్ద దిగదు. చికెన్‌ బిర్యాని, చికెన్‌ కూర ఉంటే చాలు లొట్టలేసుకుని రెండు ముద్దలు ఎక్కువగా ఆరగించేస్తారు. కానీ ఇప్పుడు ధరలు పెరుగుతుండడంతో కోడి కూర తినాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. వేసవి కాలంలో కంటే ఎక్కువగా జూన్‌ నెలలో మార్కెట్లో చికెన్‌ ధరలు పెరుగుతున్నాయి. డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి అని అంటున్నారు. రెండు వారాల క్రితం కిలో 170 రూపాయలు ఉన్న చికెన్‌ ధర..ఇపుడు 270 రూపాయలుగా ఉంది. సాధారణంగా మటన్, ఫిష్‌తో పోలిస్తే చికెన్‌ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. కిలో మటన్‌ ధరకు రెండు నుంచి మూడు కిలోల చికెన్‌ వస్తుంది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో బహిరంగ మార్కెట్‌లో చికెన్‌ కిలో ధర రూ. 270 దాటింది.

డిమాండ్‌ ఎక్కువ..సరఫరా తక్కువ
సాధారణ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల నుంచి 5 లక్షల కిలోల వరకు చికెన్‌ విక్రయాలు జరుగుతాయి. అదివారం రోజు 70 లక్షల కిలోల విక్రయాలు జరుగుతాయి. అయితే ఈసారి డిమాండ్‌కు సరిపడా కోళ్ల పెంపకం జరగలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే డిమాండ్‌ పెరిగి...సరఫరా తగ్గడంతో రేట్లు పెరిగినట్లు హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు