మర్కూక్ గ్రామ‌ సర్పంచ్‌కు కేసీఆర్‌ ఫోన్‌!

25 May, 2020 20:39 IST|Sakshi
సీఎం కేసీఆర్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, సిద్దిపేట: గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కూక్‌ గ్రామ సర్పంచ్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఫోన్‌ చేశారు. గ్రామం ఎలా ఉందంటూ పలకరించారు. త్వరలో ప్రారంభం కానున్న కొం‍డపోచమ్మ సాగర్‌ గురించి చర్చించారు. 1500 మంది కూర్చునేలా కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేయాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. ప్రాజెక్ట్‌ నిర్మాణంతో రైతుల కష్టాలు తీరినట్లేనని కేసీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, కేసీఆర్‌ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. గోదావరి జలాలు తెలంగాణలోని ప్రతి పల్లెకి చేరాలన్న ధృఢసంకల్పంతో సాగుతున్న పనులు తుది దశకు చేరుకున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టులో మర్కూక్‌ పంప్‌హౌజ్‌ చివరిది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. నాలుగైదు రోజుల్లో ఈ పర్యటన ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌కు చేర్చడం ద్వారా గోదావరి నీటిని అత్యధిక ఎత్తుకు తీసుకెళ్లినట్టవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మర్కూక్‌ పంప్‌హౌజ్‌లో మోటార్లను ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు