కలెక్టర్ క్షమాపణ చెప్పాలి

19 Nov, 2014 23:49 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: పింఛన్లు రాలేదని చెప్పుకునేందుకు వెళ్లిన వికలాంగుల పట్ల కలెక్టర్ దౌర్జన్యంగా వ్యవహరించడం గర్హనీయమని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు అందె రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో వీహెచ్‌పీఎస్ నేతలపై జిల్లా యంత్రాంగం చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీఎస్, ఎన్‌పీఆర్‌డీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టేందుకు వచ్చిన పలువురు వికలాంగులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ స్టేషన్‌కు తరలించారు.

సాయంత్రం వారిని విడుదల చేసిన అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వికలాంగులను కించపర్చేలా వ్యవహరించిన కలెక్టర్ శ్రీధర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితుడైన వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షులు కాళ్ల జంగయ్యను కలెక్టర్ తన చాంబర్‌నుంచి సిబ్బందితో గెంటివేయించారని అన్నారు.

 దళితునిపట్ల అనుచితంగా వ్యవహరించిన కలెక్టర్, సిబ్బందిపై వెంటనే  ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. అదేవిధంగా కలెక్టర్ శ్రీధర్ 24గంటల్లో వికలాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గురువారం జిల్లాలోని అన్ని మండలాల్లో ధర్నాలు, దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వికలాంగుల పట్ల కలెక్టర్ చేసిన పరుషపదజాలానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. కలెక్టర్‌పై మానవ హక్కుల సంఘంలోనూ ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా వికలాంగుల సంఘ నేతల వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ.. కలెక్టర్ సేవలను కొనియాడుతూ టీఎన్‌జీఓ నేతలు బుధవారం ప్రతికా ప్రకటన చేయడం కొసమెరుపు.

>
మరిన్ని వార్తలు