సర్వే సంపూర్ణం

22 Aug, 2014 00:27 IST|Sakshi

 ఆదిలాబాద్ అర్బన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ జిల్లాలో విజయవంతమైంది. ఒకేరోజు నిర్వహించిన సర్వేలో జిల్లా యంత్రాంగం అంచనా వేసిన దానికంటే 51 వేల కుటుంబాలు ఎక్కువగా నమోదయ్యాయి. సర్వేకు ముందు గ్రామాల్లో, పట్టణాల్లో ఇంటింటి సర్వే నంబర్ల ఆధారంగా 7,89,613 కుటుంబాలుగా నిర్దారించగా, జిల్లాలో మంగళవారం
 నిర్వహించిన సర్వే ద్వారా 8,40,971 కుటుంబాల వివరాలు సేకరించారు.

 సర్వే ద్వారా జిల్లాలో 866 గ్రామ పంచాయతీల్లో 6,83,556 కుటుంబాలు ఉన్నట్లుగా లెక్కతేలింది. ఏడు మున్సిపాలిటీల పరిధిలో 213 వార్డులకుగాను 1,57,415 కుటుంబాల వివరాలు నమోదయ్యాయి. సర్వేలో నిర్మల్ డివిజన్‌లో అత్యధికంగా కుటుంబాల వివరాలు నమోదు కాగా, ఉట్నూర్‌లో అత్యల్పంగా నమోదయ్యాయి. దీంతో జిల్లాలో సర్వే శాతం 106.50గా నమోదైంది. సర్వే వివరాలను ఆయా తహశీల్దార్ల, ఆర్డీవో కార్యాలయాల్లో సీల్ వేసి భద్రపర్చారు. రెండు రోజుల్లో వివరాలను కంప్యూటరీకరించనున్నారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ల కోసం అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సర్వే వివరాల నమోదుకు ప్రభుత్వం పదిహేను రోజుల గడువు విధించింది.

 సర్వే వివరాలిలా..
 ఆదిలాబాద్ డివిజన్‌లో 1,62,069 కుటుంబాలు, నిర్మల్‌లో 2,27,946, ఉట్నూర్‌లో 83,290, ఆసిఫాబాద్ డివిజన్‌లో 1,28,386, మంచిర్యాలలో 1,57,415 కుటుంబాలు ఉన్నట్లుగా లెక్క తేలింది. కాగా, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 33,528 కుటుంబాలు, నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో 43,781, కాగజ్‌నగర్‌లో 17,971, మందమర్రిలో 16,022, మంచిర్యాలలో 29,569, బెల్లంపల్లిలో 16,544 కుటుంబాల వివరాలు సర్వేలో నమోదయ్యాయి.

 సర్వే వివరాల నిక్షిప్తానికి 1,030 కంప్యూటర్లు
 సమగ్ర సర్వే వివరాలు కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 1,030 కంప్యూటర్లు వినియోగిస్తున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బాసర ట్రీపుల్ ఐటీలో 400 కంప్యూటర్లు, ఖానాపూర్‌లో 12, భైంసా మున్సిపాలిటీలో 20, నిర్మల్ ఎంపీడీవో కార్యాలయంలో 16, మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో 35, ఐటీఐలో 20, మందమర్రి ఐటీఐలో 20, ఎంపీడీవో కార్యాలయంలో 30, ఐటీడీఏలో 20, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 10, సీపీవోలో 8,  ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 20, సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో 20, కలెక్టరేట్‌లోని మీసేవ కేంద్రంలో 20, వివిధ మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవో కార్యాలయాల్లో 4 నుంచి 10 కంప్యూటర్ల చొప్పున ఏర్పాటు చేయగా, కొన్ని మండలాల్లో రెండు కంప్యూటర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. సర్వేలో సేకరించిన క్వాలిటీ డాటాను కంప్యూటర్‌లో నమోదు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని గురువారం మండలాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ జగన్మోహన్ ఆదేశించారు.

 జిల్లా స్థాయిలో పర్యవేక్షణ
 సమగ్ర కుటుంబ సర్వే వివరాలు కంప్యూటర్‌లో నమోదు చేసే ప్రక్రియను జిల్లా స్థాయిలో పర్యవేక్షించనున్నారు. ఇందుకు డీఆర్వో ప్రసాదరావు, సీపీవో షేక్‌మీరా, ఎన్‌ఐసీ డీఐవో రాకేష్‌ను నియమించారు. రోజు కంప్యూటర్‌లో నమోదు చేసిన వివరాలు కలెక్టరేట్‌కు పంపాల్సి ఉంటుంది. సర్వే వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేసేటప్పుడు సదరు గ్రామ ప్రణాళిక అధికారి డాటా ఎంట్రీ ఆపరేటర్ వద్ద ఉండాల్సి ఉంటుంది. రోజుకు 80 నుంచి 100 వరకు సర్వే ఫారమ్‌ల వివరాలను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 72 లోకేషన్లలో ఈ సర్వే వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేయనున్నారు. ప్రతి లోకేషన్‌కు ముగ్గురు ఇన్‌చార్జీలను నియమించాలని ఆర్డీవోలను కలెక్టర్ ఇటీవలే ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు