సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజల్లో ఆందోళన

14 Aug, 2014 03:54 IST|Sakshi

డిచ్‌పల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వే పై ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయని, సర్వేను కేవలం ఒక రోజే నిర్వహించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వి.గంగాధర్‌గౌడ్ (వీజీగౌడ్) అన్నారు. బుధవారం  డిచ్‌పల్లిలో ఆయన విలేకరులతో  మాట్లాడారు. సర్వేపై ప్రజలు తీవ్ర ఆందోళన  చెందుతున్నారని అన్నారు.

 దేశంలోని ఇతర రాష్ట్రాల్లో వేలాది మంది తెలంగాణ ప్రజలు బతుకు దెరువు కోసం వలస వెళ్లారని, వారంతా ఇప్పుడు రాష్ట్రానికి రావడానికి ఇబ్బం దులు పడుతున్నారని అన్నారు. సర్వే ఫార్మాట్‌లో 96 కాలమ్స్ ఉన్నాయని ఇవన్నీ పూర్తి చేయాలంటే కనీసం 45 నిమిషాలు పడుతుందన్నారు. అలాగే గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి వివరాలు సర్వేలో తీసుకోవద్దని సూచించడం సమంజసం కాదన్నారు. గల్ఫ్ బాధితుల అంశం చేర్చాలని కోరారు. ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని సర్వేను వారం రోజుల పాటు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో సుమారు 600 గిరిజన తండాలు ఉన్నాయని, జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని అన్నారు.

గతంలో డి చ్‌పల్లి మండలం ఇందల్వాయి వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై ట్రామా కేర్ సెంటర్ మంజూరు కాగా దానిని జిల్లా కేంద్రానికి తరలించారని అన్నారు. జాతీయ రహదారిపై ప్రయాణికులు తరచూ ప్రమాదాలకు గురువుతుంటారని వెంటనే ఇందల్వాయి వద్ద ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆయన  డిమాండ్ చేశారు.  సమావేశంలో విండో చైర్మన్ పూర్యానాయక్, టీడీపీ మండల అధ్యక్షుడు నందుబాబు, నాయకులు పూర్యానాయక్, కుంట నర్సారెడ్డి, విఠల్ రాథోడ్, అబ్బులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు