రసాభాసగా అఖిలపక్ష భేటీ

28 Dec, 2019 15:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికలపై శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశం రసాభాసగా మారింది. సమావేశానికి హాజరయిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు మధ్యలోనే వాకౌట్‌ చేశారు. అంతకు ముందు కాంగ్రెస్‌ నేతలు మర్రి శశిధర్‌ రెడ్డి, నిరంజన్‌రావు ఎన్నికల కమిషనర్‌తో వాదనలకు దిగారు. తమ అభిప్రాయాలను పట్టించుకోలేదని, ఈసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఇష్టప్రకారం నోటిఫికేషన్‌ విడుదల చేశారని, ఎన్నికల కమిషన్‌ అధికార పార్టీకి, ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తోందని శశిధర్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే కాంగ్రెస్‌ నేతలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌తో ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

దీంతో తాము వాకౌట్‌ చేస్తున్నామంటూ మర్రి శశిధర్‌ రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్, ఎంఐఎం మినహా.. మిగతా పార్టీలు రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశాయని తెలిపారు. అయితే వారి డిమాండ్లను ఈసీ పట్టించుకోలేదని అన్నారు. షెడ్యూల్‌లో మార్పులు చేసి సంక్రాంతి తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కోరామని, దానిపై ఎన్నికల సంఘం ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్‌రావు మాట్లాడుతూ... రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికలు నిర్వహించడం మొదటిసారి చూస్తున్నామన్నారు. ఎన్నికల ప్రధాన అధికారి నాగిరెడ్డి అధికార పార్టీకి వత్తాసు పలికే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషనర్‌ దురుసుగా ప్రవర్తించడం సరికాదన్నారు.

ఎన్నికల కమిషన్‌ కార్యాలయం టీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీస్‌లా ఉందని తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు నాగరాజు వ్యాఖ‍్యానించారు. బీసీల రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు తగ్గించి కుట్ర చేశారన్నారు. రిజర్వేషన్‌లు ప్రకటించకుండా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. మద్యం దుకాణాలు మూసివేయాలని చెప్పినా ఎన్నికల కమిషనర్‌ పట్టించుకోలేదని విమర్శించారు. దళిత బహుజన పార్టీ నేత కృష్ణ స్వరూప్‌ మాట్లాడుతూ... కుల దురహంకారం చూపించారని, రిజర్వేషన్‌లు ప్రకటించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని చెబితే తనపై దాడి చేశారన్నారు. తనపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని ఆయన తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా