-

‘కాంగ్రెస్’ వాకౌట్

13 Sep, 2014 01:35 IST|Sakshi
‘కాంగ్రెస్’ వాకౌట్

- రుణమాఫీ, పంట పరిహారంపై రగడ
 కరీంనగర్ : జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశం పంటనష్ట పరిహారం, రుణమాఫీ అంశంపై  అట్టుడికింది. ఓ దశలో తీవ్ర వాగ్వాదం జరిగి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ సభ్యులంతా వాకౌట్ చేసే వరకూ వెళ్లింది. సమావేశం ప్రారంభం కాగానే జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా పంటనష్ట పరిహారం రూ.108 కోట్లు విడుదల కాగా, వ్యవసాయశాఖ అధికారులు కేవలం రూ.18 కోట్లు రైతులకు చెల్లించి చేతులు దులుపుకున్నారని, నిధులు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యమెందుకని మండిపడ్డారు. రుణమాఫీపై రోజుకో ప్రకటన చేస్తున్నారని, టైటిల్-1బీ అంటూ బ్యాంకులు అభ్యంతరాలు చెబుతున్నాయని, సభకు మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టమైన సమాధానం చెప్పాలని జీవన్‌రెడ్డి పదేపదే కోరారు.

ఎమ్మెల్యే పుట్ట మధు జోక్యం చేసుకుని రైతుల పట్ల ప్రభుత్వం కృతనిశ్చయం తో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంథని ప్రాంతంలో నాయకులు దోచుకో... దాచుకో అన్న చందంగా ఖజానాను కొల్లగొట్టారని ఆరోపించారు. ఆదర్శరైతుల అవినీతికి అడ్డులేకుండా పోయిందని, ఎకరం భూమిపైనే నాలుగైదు పేర్లు రాసి ఆదర్శరైతులే డబ్బులు కాజేశారని, తన నియోజకవర్గంలోని గద్దలపల్లి ఆదర్శరైతు వ్యవహారంపై వివరించారు.

జీవన్‌రెడ్డి జోక్యం చేసుకుని ప్రభుత్వం మీదే ఉందని, విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అనడంతో బెజ్జంకి జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, శంకరపట్నం జెడ్పీటీసీ పి.సంజీవరెడ్డి జోక్యం చేసుకున్నారు. బెజ్జంకి మండలంలో పరిహారం రూ.5 కోట్లు వస్తే రూ.3 కోట్లు కాంగ్రెస్ కార్యకర్తలకే వచ్చాయని విమర్శించారు. బెజ్జంకి వ్యవసాయాధికారిని సస్పెండ్ చేయాలని జేడీఏకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని అన్నారు.

కాంగ్రెస్ హయాంలో చేసిన పనులను చక్కదిద్దేందుకే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంటే జీవన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ను విమర్శించడం ఏంటని మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్‌కు చెందిన కాటారం జెడ్పీటీసీ నారాయణరెడ్డి జోక్యం చేసుకుని సీనియర్ ఎమ్మెల్యే అయిన జీవన్‌రెడ్డిని అలా సంబోధించడం సరికాదని అనడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యుల పరస్పర విమర్శలు, అరుపులతో సభ దద్దరిల్లింది. గౌరవం లేని సభలో తాను ఉండబోనని జీవన్‌రెడ్డి పోడియం వద్దకు వచ్చి మంత్రి ఈటెల, చైర్‌పర్సన్ ఉమతో వాగ్వాదానికి దిగారు.

టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలు పుట్ట మధు, గంగుల కమలాకర్ జీవన్‌రెడ్డిని సముదాయించి సీట్లో కూర్చోబెట్టారు. చైర్‌పర్సన్ సభను నడిపించే ప్రయత్నం చేస్తుండగానే జీవన్‌రెడ్డి మరోసారి జోక్యం చేసుకుని, కాంగ్రెస్ సభ్యులతో కలిసి వాకౌట్ చేసి ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, జెడ్పీటీసీలతో కలిసి ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు.

జెడ్పీ భవనాన్ని టీఆర్‌ఎస్ కార్యాలయంగా మార్చుకుని అమర్యాదగా ప్రవర్తించారని, క్షమాపణ చెప్పే వరకు జెడ్పీలో అడుగుపెట్టేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు.  20 నిమిషాల పాటు నిరసన తెలపగా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, సోమారపు సత్యనారాయణ, సతీశ్‌బాబు తదితరులు జీవన్‌రెడ్డితో మాట్లాడి సభలోకి రావాలని పదేపదే విజ్ఞప్తి చేయడంతో సభ్యులతో కలిసి ఆయన తిరిగివచ్చారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మనసు బాధకలిగితే క్షమించాలని బెజ్జంకి జెడ్పీటీసీ శరత్‌రావు కోరడంతో గొడవ సద్దుమణిగింది.

మరిన్ని వార్తలు