Sakshi News home page

రైతుబంధుకు బ్రేక్‌ వెనక  కాంగ్రెస్, బీజేపీ కుట్ర 

Published Tue, Nov 28 2023 1:41 AM

Minister KTR Comments on Congress in Peddapalli - Sakshi

సాక్షి, పెద్దపల్లి/హుజూరాబాద్‌/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ఏటూరునాగారం/వెల్గటూర్‌ (ధర్మపురి)/అంబర్‌పేట/ముషిరాబాద్‌: కాంగ్రెస్, బీజేపీ కలసి కొత్త కుట్రకు తెరలెపి రైతుబంధు సొమ్ము రైతుల ఖాతాల్లో పడకుండా ఆపాయని మంత్రి కె. తారక రామారావు ఆరోపించారు. రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్‌ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే బీజేపీ నేతలు ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి నిలిపివేయించారని దుయ్యబట్టారు.

అధికారంలోకి రాకముందే ఆ పార్టీలు రైతుబంధును కాటగలిపి రైతుల నోట్లో మట్టిగొట్టాయని... పొరపాటున ఆ పార్టీలు అధికారంలోకి వస్తే రైతుబంధును మొత్తానికే ఎత్తగొడ్తాయని హెచ్చరించారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఓటుతో బుద్ధిచెప్పాలని కోరారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్, జగిత్యాల జిల్లా వెల్గటూర్, మంచిర్యాల జిల్లా చెన్నూరు, ములుగు జిల్లా ఏటూరునాగారంతోపాటు హైదరాబాద్‌లోని అంబర్‌పేట, ముషీరాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున నిర్వహించిన రోడ్‌ షోలలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. 

కరెంట్‌ కావాలా.. కాంగ్రెస్‌ కావాలా.. 
కరెంట్‌ కావాలో లేక కాంగ్రెస్‌ కావాలోప్రజలే నిర్ణయించుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. 2014కు ముందు తెలంగాణలో కరెంటు కష్టాలు ఎలా ఉండేవో ఒక్కసారి గుర్తుచేసుకోవాలన్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల కరెంటు ఇస్తున్న విషయాన్ని గమనించాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ కరెంటు ఉండదని, కర్ణాటకలో గెలిపించినందుకు ప్రజలు చెంపలు వేసుకుంటున్నారని తెలిపారు. 

పిరమైన ప్రధాని.. 
బీజేపీకి ఓటు వేస్తే మోటార్ల కాడ మీటర్లు బిగిస్తామని బాహాటంగానే చెబుతున్న విషయాన్ని రైతులు గమనించాలని కేటీఆర్‌ కోరారు. ప్రధాని మోదీ జన్‌ధన్‌ ఖాతాలు తీయమని చెప్పి రూ.15 లక్షలు వేస్తామని హామీ ఇచ్చి కనీసం రూ. 15 కూడా వేయలేదని విమర్శించారు. దేశంలో నిత్యావసర సరుకులను పిరం చేసి ప్రియమైన ప్రధాని కాకుండా పిరమైన ప్రధానిగా మోదీ మారిపోయారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. 

మిత్తితో సహా రైతు రుణమాఫీ.. 
ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీని మిత్తితో సహా చెల్లిస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లే అవుతోందని.. కొన్నింట్లో చిన్నచిన్న పొరపాట్లు ఉండవచ్చని.. వాటన్నింటినీ సరిచేసుకుందామన్నారు. కాంగ్రోసోళ్లు ఓటుకు రూ. 10 వేలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసిందని... ఆ డబ్బును అందరూ తీసుకొని ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని కేటీఆర్‌ కోరారు. అంబర్‌పేటలో బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే మెట్రో రైలు విస్తరిస్తామని, మూసీ సుందరీకరణ చేపట్టి దానిపై కొత్త బ్రిడ్జీలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 

గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి సంక్షేమ బోర్డు 
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హామీ 
సాక్షి, హైదరాబాద్‌: స్విగ్గి, జొమాటో, ఓలా, ఉబర్‌ ఇతర పార్ట్‌టైం ఉద్యోగాలు చేసే యువకుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఆ సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి ఉద్యోగులకు ఆరోగ్య బీమా, పీఎఫ్, ఈఎస్‌ఐ అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోమవారం తనను కలిసిన వివిధ ఫుడ్‌ డెలివరీ ఉద్యోగులతో కేటీఆర్‌ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే అధికారులు, కంపెనీల ప్రతినిధులు, గిగ్‌ వర్కర్ల ప్రతినిధులతో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. గిగ్‌ వర్కర్లకు కనీస జీతాలను చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వమే ఫుడ్‌ డెలివరీ, క్యాబ్‌ బుకింగ్, ఇతర ఆన్‌లైన్‌ సేవలకు ప్రత్యేక యాప్‌ని ఏర్పాటు చేస్తే తమకు ఉపయుక్తంగా ఉంటుందని పలువురు ఉద్యోగులు చేసిన సూచనపై కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు. దీనిపై అధ్యయనం చేస్తామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement