మరణాలు ఒక శాతమే

22 Jul, 2020 06:39 IST|Sakshi

ఇప్పటికి 66% రోగులు కోలుకున్నారు

33% మంది చికిత్స పొందుతున్నారు

16 ప్రభుత్వ, 23 ప్రైవేట్‌ ల్యాబ్‌లలో పరీక్షలు

కరోనా చికిత్సకు జీహెచ్‌ఎంసీలో 9, రాష్ట్రంలో 52 ప్రభుత్వ  ఆసుపత్రులు

హైకోర్టుకు నివేదించిన ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా బారినపడుతున్న వారిలో 1 శాతం రోగులే మృత్యువాతపడుతున్నారని ప్రజా ఆరోగ్య విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 66 శాతం మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారని, 33 శాతం మంది రోగులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. కరోనా రోగులను గుర్తించేందుకు సరైన పరీక్షలు నిర్వహించడం లేదని, వైద్యులకు పీపీఈ కిట్లు ఇవ్వడం లేదంటూ పలువురు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం..నివేదిక ఇవ్వాలని ఆదేశించి న నేపథ్యంలో డాక్టర్‌ శ్రీనివాసరావు మంగళవారం నివేదిక సమర్పించారు.

ఈనెల 15 నాటికి 2,08,666 మం దికి పరీక్షలు చేశామని, గతంలో ప్రతి పది లక్షల మందిలో 2,530 మందికి పరీక్షలు చేయగా, ఇటీవల ఆ సంఖ్యను 5,961 మందికి పెంచామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో జోన్లు, సర్కిల్స్, వార్డుల వారీగా పాజిటివ్‌ కేసుల సమాచారాన్ని వైద్య, ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకునేలా చైతన్యం చేయాలని కాలనీ అసోసియేషన్లకు విజ్ఞప్తి చేశామన్నారు. ఐసీఎంఆర్‌ అనుమతి మేరకు రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రభుత్వ, 23 ప్రైవేటు ల్యాబ్‌లు కరోనా పరీక్షలు చేస్తున్నాయని, ప్రభుత్వ ల్యాబ్‌లలో ఉచితంగా పరీక్ష చేస్తుండగా, ప్రైవేటు ల్యాబ్‌లలో రూ.2,200కు చేస్తున్నారని పేర్కొన్నారు. 

గత 20 రోజుల్లో 1,37,732 మందికి పరీక్షలు చేశామన్నారు. రెండు లక్షల ర్యా పిడ్‌ యాంటిజెన్‌ పరీక్ష కిట్లు తెప్పించి రాష్ట్రవ్యాప్తంగా 870 పీహెచ్‌సీ కేంద్రాల్లో పరీక్షలు చేస్తున్నామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 300 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామని, ఐసీఎంఆ ర్‌ నిబంధనల మేరకు కరోనా రోగులను కలిసిన వారికి 5వ, 10వ రో జున పరీక్షలు చేస్తున్నామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 9, రాష్ట్రవ్యాప్తంగా 52 ప్రభుత్వ ఆసుపత్రులను, 57 ప్రైవేటు ఆసుపత్రులను కరోనా చికిత్స కోసం గుర్తించామన్నారు. గాంధీ ఆసుపత్రిలో బెడ్స్‌ సంఖ్య ను 1,012 నుంచి 1,890కి పెంచామన్నారు.

ఇందులో 500 ఐసీయూ, 700 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉన్నాయని, 350 వెంటిలేటర్లు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు. 665 నూతన పోస్టులను మంజూరు చేశామని, త్వరలోనే నియామక ప్రక్రియ పూర్తవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, నర్సులు, పోలీసుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉద్యోగులను ఏ, బీ గ్రూపులుగా విభజించామని, ఒక గ్రూపు వారం పనిచేస్తే మరోవారం క్వా రంటైన్‌లో ఉంటుందన్నారు. వసతి కావాలని కోరిన వారికి గాం ధీలోనే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈనెల 9 నాటికి 87,757 పీపీఈ కిట్లకుగాను 80,851 ఉపయోగించగా, 6,906 అందుబాటులో ఉన్నాయని, 1,81,040 ఎన్‌–95 మాస్కులకుగాను 1,63,590 ఉపయోగించామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 61, రాష్ట్రవ్యాప్తంగా 349 కంటైన్మెంట్‌ జోన్లను గుర్తించామన్నారు. 

మరిన్ని వార్తలు