చమురు ధరలు తగ్గుముఖం 

10 Mar, 2020 02:31 IST|Sakshi

పెట్రోల్, డీజిల్‌పై కరోనా ఎఫెక్ట్‌ 

గత రెండు నెలలుగా పైసాపైసా తగ్గుముఖం 

సాక్షి, హైదరాబాద్‌ : చమురు ధరలపై కరోనా వైరస్‌ ప్రభావం చూపింది. చమురుకు డిమాండ్‌ ఎక్కువగా ఉండే చైనాలో కరోనా వైరస్‌ విస్తరించడంతో చమురు వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయ మార్కెట్లో గత పక్షం రోజులుగా చమురు ధరలు మరింత పడిపోయాయి. వరుసగా క్షీణత నమోదవుతోంది. పెట్రోల్, డీజిల్‌ ధరలు గత మూడు మాసాలుగా పైసాపైసా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ మహానగరంలో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.75.04 ఉండగా, డీజిల్‌ ధర లీటర్‌కు రూ.68.88 ఉంది.  

గత మూడు నెలల నుంచే... 
జనవరిలో పెట్రోల్‌ ధర రూ.80.80 ఉండగా, ఆ మాసంలో రూ.2.05 తగ్గింది. ఫిబ్రవరిలో రూ.77.77 పైసలు ఉండగా, ఇదే నెలలో రూ.1.17 తగ్గింది. మార్చి 1న రూ.76.23 ఉండగా, ప్రస్తుతం రూ.75.04కు చేరింది. ఇక డిజిల్‌ ధరను పరిశీలిస్తే జనవరిలో రూ. 75.42 ఉండగా, అదే నెలలో రూ.1.89 తగ్గింది. ఇక ఫిబ్రవరిలో రూ.72.16 ఉన్న ధర...రూ.70.27కు పడిపోయింది. మార్చి1న రూ.70.01 ఉన్న ధర.... ప్రస్తుతం రూ.68.88కి చేరింది. మరో పక్షం రోజులు సైతం పైసాపైసా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఏప్రిల్‌ ఒకటి నుంచి మాత్రం ధరల మోత మోగే అవకాశం లేకపోలేదు. ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రానున్న బీఎస్‌–6 ఉద్గానా నిబంధనలే ఈ ధరల పెరుగుదలకు కారణం.  

మరిన్ని వార్తలు