మరో కోవిడ్‌ పాజిటివ్‌

16 Mar, 2020 02:48 IST|Sakshi
గాంధీ ఆస్పత్రిలోని కోవిడ్‌ హెల్ప్‌డెస్క్‌ వద్ద వేచి చూస్తున్న కరోనా అనుమానితుడు

నెదర్లాండ్‌ నుంచి రాష్ట్రానికి వచ్చిన వ్యక్తికి కరోనా ఉన్నట్లు గుర్తింపు 

నిర్ధారించిన పుణే ల్యాబ్‌

రెండింటిలో ఒకటి నెగెటివ్‌

దేశంలో కోవిడ్‌ కేసులు 107

మహారాష్ట్రలో నమోదైన కేసులు.. 31

కేరళలో నమోదైన కేసులు.. 22

వివరాలు వెల్లడించిన కేంద్రం

మొత్తంగా రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసులు 3

చనిపోయిన వ్యక్తిలో కోవిడ్‌ ఉండదని వైద్యుల వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో కోవిడ్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. నెదర్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్‌ పాజిటివ్‌గా గుర్తించారు. ఆ వ్యక్తి రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొత్తపేట వాసవి కాలనీకి చెందినవారు. ఇప్పటికే ఆయనతో 12 మంది అతి సన్నిహితంగా మెలిగినట్లు గుర్తించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఆయన గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. బాధితుడు కుటుంబసభ్యులు ఎంత మంది.. ఎక్కడెక్కడ.. ఎంత మందితో తిరిగాడు.. ఏయే ప్రాంతాలు సందర్శించాడు? లక్షణాలు బయట పడ్డాక చికిత్స కోసం స్థానికంగా ఏ ఆస్పత్రుల్లో చూపించాడు.. వంటి అంశాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఇటలీ నుంచి వచ్చిన ఓ వైద్య విద్యార్థినికి ఇప్పటికే కరోనా పాజిటివ్‌ రాగా, ఆమె గాంధీలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సౌదీ నుంచి వచ్చిన యువతి నమూనాల్లో కరోనా నెగెటివ్‌ వచ్చింది. కోవిడ్‌ నిర్ధారణ కోసం ఇటీవల పుణేకు పంపిన రెండు కేసుల్లో ఒకటి నెగెటివ్‌ కాగా, రెండోది పాజిటివ్‌ వచ్చింది. కోవిడ్‌ సోకి కోలుకున్న వ్యక్తి సహా ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడుకు చేరింది. కాగా, మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండలానికి చెందిన ఓ విద్యార్థికి కోవిడ్‌ సోకిందన్న అనుమానంతో శనివారం అతడి నమూనాలు గాంధీకి పంపి పరీక్షలు చేయగా.. నెగెటివ్‌ వచ్చింది.

అలాగే హన్మకొండకు చెందిన మరో వ్యక్తి 20 రోజుల కింద అమెరికా నుంచి వచ్చాడు. దగ్గు, జలుబు, జ్వరం ఉండటంతో చికిత్స కోసం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చాడు. అతడిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నమూనాలను హైదరాబాద్‌లోని గాంధీకి కోవిడ్‌ పరీక్షల కోసం పంపారు. ఇంకో వ్యక్తి కూడా కోవిడ్‌ అనుమానిత లక్షణాలతో ఎంజీఎంకు వచ్చిన ఓ వ్యక్తి చెప్పకుండానే వెళ్లిపోయాడు. దీంతో అతడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. 

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులు..
దేశంలో కోవిడ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారం రాత్రి ప్రకటించిన లెక్కల ప్రకారం దేశంలో 107 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శనివారం నాటికి ఆ సంఖ్య 84 మాత్రమే. అంటే ఒక్క రోజులోనే అదనంగా 23 కేసులు నమోదు కావడం ఆందోళనకరం. మొత్తం 13 రాష్ట్రాల్లోకి కోవిడ్‌ పాకింది. అత్యధికంగా మహారాష్ట్రలో 31 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కేరళలో 22 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత హరియాణాలో 14, ఉత్తరప్రదేశ్‌లో 11, ఢిల్లీలో 7, కర్ణాటకలో 6 కేసులు నమోదయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో సరైన సమయంలో తగు చర్యలు తీసుకోకపోవడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కేరళలో పాజిటివ్‌ వచ్చిన వారినీ ఇళ్లల్లోనే క్వారంటైన్‌ చేశారని, దీంతో ఇతరులకు కూడా సోకిందని పేర్కొంటున్నారు.
హైదరాబాద్‌ ఫీవర్‌ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో పనిచేస్తున్న  వైద్య సిబ్బంది, రోగులు వాడిన దుస్తులను తగలబెడుతున్న దృశ్యం
హైదరాబాద్‌ ఫీవర్‌ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో పనిచేస్తున్న  వైద్య సిబ్బంది, రోగులు వాడిన దుస్తులను తగలబెడుతున్న దృశ్యం 

దేశంలో ప్లాన్‌–బీ అమలు..
ప్రస్తుతం దేశంలో కోవిడ్‌ వైరస్‌ నియంత్రణకు ప్లాన్‌–బీ నడుస్తోందని కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు విమానాశ్రయాల్లో జల్లెడ పట్టి గుర్తించామని, అందులో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు నయం చేశామని అంటున్నారు. ప్లాన్‌–బీలో భాగంగానే అనేక రాష్ట్రాలు పాఠశాలలు, కాలేజీలు, థియేటర్లను మూసేశారని తెలిపారు. ప్లాన్‌–బీతో కూడా కోవిడ్‌ నియంత్రణలోకి రాకపోతే, ప్లాన్‌–సీ కూడా అమలు కానుందని అంటున్నారు. ప్లాన్‌–సీ అంటే ఒకరకంగా పూర్తిస్థాయి కర్ఫ్యూ వాతావరణమే నెలకొంటుంది.

ఇళ్ల నుంచే పనిచేయాల్సి ఉంటుంది. వీధుల్లో మనుషులు తిరిగే పరిస్థితి ఉండదు. వైద్యాధికారులు మాత్రమే ముసుగులు ధరించి విధులు నిర్వహిస్తారు. ఇతర అన్ని కార్యకలాపాలు బంద్‌ అవుతాయి. ఇటువంటి పరిస్థితి వస్తుందా రాదా అన్న దానిపై స్పష్టత లేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. వైరస్‌ రూపం మార్చుకొని ఈ ఉష్ణోగ్రతలోనూ తన ఉనికిని కాపాడుకోగలిగితే సీ ప్లాన్‌ అమలు చేయకతప్పని పరిస్థితి ఉంటుందన్న చర్చ కూడా సాగుతోంది.

మూడు కేటగిరీలుగా విభజన..
కోవిడ్‌ తీవ్ర ప్రభావం ఉన్న 7 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను ఐసోలేషన్‌ చేయాలని సర్కారు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. చైనా, ఇటలీ, దక్షిణ కొరియా, ఇరాన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్‌ నుంచి వచ్చే విమాన ప్రయాణికులను 14 రోజుల పాటు వికారాబాద్‌లోని హరిత రిసార్టులో ఉంచుతారు. వీరిని 3 కేటగిరిలుగా విభజిస్తారు. కేటగిరీ ‘ఏ’ను హైరిస్క్‌గా గుర్తిస్తారు. ఇందులో జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులన్న వారిని ఇతర ప్రయాణికుల నుంచి వేరుపరచి నేరుగా ఆస్పత్రికి తరలిస్తారు.

బీ–కేటగిరిలో మాధ్యమిక రిస్కు కింద పరిగణిస్తారు. 60 సంవత్సరాలు పైబడి ఉన్న వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌కు తరలిస్తారు. రోజూ వారిని వైద్యులు పరిశీలిస్తారు. సీ కేటగిరిలో తక్కువ రిస్క్‌ ఉన్నవారు ఉంటారు. ఎటువంటి లక్షణాలు లేనివారు. వీరందర్నీ హోం ఐసోలేషన్‌లోనే ఉంచాలని నిర్ణయించారు. అయితే ఈ ఏడు దేశాల నుంచి వచ్చే వారెవరైనా లక్షణాలు లేకున్నా తమ ఆధ్వర్యంలోనే ఐసోలేషన్‌ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది.

ఇతర రాష్ట్రాల సహకారం..
కొందరు విదేశాల నుంచి నేరుగా రావట్లేదు. ఢిల్లీ, ముంబై లాంటి చోట్ల విమానాలు దిగి, అక్కడి నుంచి రైళ్లు, బస్సుల ద్వారా రాష్ట్రానికి వస్తున్నారు. దీంతో వారిని కనిపెట్టడం కష్టమవుతోంది. అందుకే ఇతర రాష్ట్రాల సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. ప్రస్తుతం ఎక్కడ విమానం, ఓడ దిగినా వారి వివరాలన్నింటినీ స్థానిక ప్రభుత్వ అధికారులు నమోదు చేయాలని నిర్ణయించారు. అందరి డేటాను తీసుకోవాలని అనుకుంటున్నారు. దాన్ని ఇతర రాష్ట్రాలకు షేర్‌ చేయనున్నారు. దాని ఆధారంగా తెలంగాణకు చెందిన వ్యక్తులు ఎక్కడ దిగినా ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది.

ప్రధానంగా గత నెల రోజులుగా విదేశాల్లో ఏ దేశంలో ప్రయాణించారనేది పాస్‌పోర్టు ఆధారంగా గుర్తిస్తున్నారు. కోవిడ్‌ తీవ్ర ప్రభావిత దేశంలో ప్రయాణించి వస్తే వారిని ఇక్కడ గుర్తించి ఐసోలేషన్‌ చేస్తారు. కొందరు విదేశాల నుంచి వచ్చిన వారు ఐసోలేషన్‌కు ఒప్పుకోవట్లేదు. వైద్య ఆరోగ్య సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీంతో ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. పోలీసులు రంగంలోకి దిగారు. ఐసోలేషన్‌కు సహకరించని వారిని పోలీసుల సాయంతో కేంద్రాలకు తీసుకెళ్లనున్నారు.

ఖననంపై మార్గదర్శకాలు..
కోవిడ్‌తో మరణించిన వారి మృతదేహాల ఖననంపై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేయనుంది. మన దేశంలో రెండు మరణాలు చోటు చేసుకోవడంతో, మున్ముందు వాటి సంఖ్య పెరిగే అవకాశముందన్న అభిప్రాయంతో కేంద్రం మృతదేహాల ఖననాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు. కాగా, కోవిడ్‌తో చనిపోతే వైరస్‌ ఆ వ్యక్తిలో ఉండదని అధికారులు చెబుతున్నారు. అయినా.. అందుకు సంబంధించిన ప్రొటోకాల్‌ ఎలా ఉండాలనే దానిపై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయనుంది. కోవిడ్‌తో ఎవరైనా చనిపోతే 15 మందికి మించి అంత్యక్రియల్లో పాల్గొనకూడదని కేరళ ఇప్పటికే మార్గదర్శకాలు ఇచ్చినట్లు ఓ వైద్యాధికారి తెలిపారు. 

చదవండి:
24 గంటల్లో వంద మరణాలు.. 2వేల కరోనా కేసులు
కరోనా ఎఫెక్ట్‌ : వణుకుతున్న మహారాష్ట్ర
ఇప్పుడు జరుగుతుంది 2011లోనే ఎలా తెలిసింది?

మరిన్ని వార్తలు