‘క్రిమినల్‌ చర్యలు ఎంతవరకు వచ్చాయి?’

26 Apr, 2019 03:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గుడి మల్కాపూర్‌లోని సర్వే నంబర్‌ 284/6లోని భూమికి కొన్ని నకిలీ పత్రాల ఆధారంగా ఎన్‌వోసీ జారీ చేసిన వ్యవహారంలో బాధ్యులపై శాఖాపరమైన చర్యలు ఎంతవరకు వచ్చాయో తెలపాలని హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. నకిలీ పత్రాలు సమర్పించిన వారిపై క్రిమినల్‌ చర్యలు ఎంతవరకు వచ్చాయో కూడా చెప్పాలంది. దీనికి సంబంధించి ఓ స్థాయీ నివేదికను తమ ముందుంచాలని న్యాయమూర్తులు జస్టిస్‌ రామసుబ్రమణియన్, జస్టిస్‌ కేశవరావుల ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌కి వాయిదా వేసింది.

గుడిమల్కాపూర్‌లో తాను కొన్న 5,262 చదరపు గజాల స్థలానికి ఇతరుల పేరుతో ఎన్‌వోసీ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ శాంతి అగర్వాల్‌ అనే మహిళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి, ఎన్‌వోసీ జారీ నిబంధనలకు అనుగుణంగా జరగలేదని తేల్చారు. ఎన్‌వోసీ జారీ కమిటీ చైర్మన్‌గా ఉన్న నవీన్‌ మిట్టల్, సభ్యులైన జాయింట్‌ కలెక్టర్‌ దుర్గాదాస్‌ తదితరులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. నకిలీ పత్రాలు ఇచ్చిన సయ్యద్‌ అబ్దుల్‌ రబ్‌ తదితరులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై ధర్మాసనం విచారణ జరిపింది. 

మరిన్ని వార్తలు