అనుమతి లేకుండా తొలగించొద్దు 

7 Mar, 2019 07:49 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌

బోగస్‌ ఓట్లను తొలగించేందుకు బీఎల్‌ఓలతో సమావేశం నిర్వహించాలి  

ఆర్డీఓ, తహసీల్దార్‌లకు సూచించిన కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌ 

నాగర్‌కర్నూల్‌: ఓటర్‌ జాబితా నుంచి ప్రొఫార్మా–7, ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఓటర్‌ జాబితా నుంచి ఓట్లను తొలగించొద్దని జిల్లా కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం ఓటర్‌ జాబితాలో బోగస్‌ ఓట్ల తొలగింపుపై తహసీల్దార్లు, ఆర్డీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్‌ బోగస్‌ ఓట్లను తొలగించేందుకు అన్ని పోలింగ్‌ బూత్‌ లెవల్‌ అధికారులతో సమావేశం నిర్వహించి డబుల్‌ ఎంట్రీ ఓటర్లను తొలగించాలన్నారు.

ఓటరు జాబితా సవరణలో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయకుండా కొన్ని చోట్ల ఓట్లను తొలగించారని, మరికొన్ని చోట్ల రెండు పేర్లను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తి స్థాయిలో బోగస్‌ ఓట్లను తొలగించేందుకు బూత్‌ లెవల్‌ అధికారులను సంప్రదించి ఎన్ని ఓట్లు తొలగించారో పూర్తి సమాచారంతో గురువారం జరిగే సమావేశానికి హాజరు కావాలన్నారు. రెండు ఓట్లు తొలగించిన వారితో ప్రొ ఫార్మా–6తో తిరిగి వారికి ఓటుహక్కు కల్పించాలని ఆదేశించారు.

జిల్లాలో సాంకేతిక లోపంతో ఉన్న 450 ఓట్లను ప్రొ ఫార్మా–8 వినియోగించి పేర్లు, డేట్‌ ఆఫ్‌ బర్త్, ఇతర సవరణలను సరిచేయాలని తహసీల్దార్లకు సూచించారు. నియోజకవర్గంలో డబుల్‌ ఎంట్రీ ఓట్లను ఆయా మండలాల్లో తొలగించేందుకు ఆర్డీఓలు రాష్ట్ర ఎన్నికల అధికారి అనుమతి పొందేందుకు లేఖతో సమావేశానికి హాజరు కావాలన్నారు. అదే విధంగా భూ ప్రక్షాళన పనులు వేగవంతం చేసి, వాటికి సంబంధించిన డిజిటల్‌ సంతకాలు, ఇతర విషయాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌ఓ మధుసూదన్‌నాయక్, జిల్లా ఎన్నికల నోడల్‌ అధికారులు మోహన్‌రెడ్డి, అనిల్‌ ప్రకాశ్, ఆర్డీఓలు హనుమనాయక్, పాండునాయక్, రాజేష్‌కుమార్, కలెక్టరేట్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 ఈవీఎంలపై వీడియో కాన్ఫరెన్స్‌ 

కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు బుధవారం జిల్లా కలెక్టర్లతో ఈవీఎంలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నిక ల్లో వినియోగించే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు, వీవీ ప్యాట్ల పనితీరు, నియోజకవర్గానికి అవసరమైన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు, పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చేరాయా లేదా అనే విషయంపై సమీక్ష నిర్వహించారు. అదే విధంగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు మొదటి విడత తనిఖీలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలకు సంబంధించి టెక్నికల్‌ సమస్యలు వస్తే భారత్‌ ఎలక్ట్రానిక్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి ప్రతినిధులు వస్తారని తెలిపారు. ఈ వీసీలో కలెక్టర్‌ ఈ.శ్రీధర్, జేసీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు