శిథిల భవనాలు.. గాలిలో ప్రాణాలు! 

7 Mar, 2019 07:56 IST|Sakshi
బోధన్‌లోని బీసీ బాలికల హాస్టల్‌లో కూలిన పైకప్పు , గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని

కూలేందుకు సిద్ధంగా పలు హాస్టళ్ల భవనాలు

ఇటీవల బోధన్‌ బాలికల హాస్టల్‌లో కూలిన పైకప్పు

తీవ్ర గాయాలతో బయటపడ్డ విద్యార్థినులు

మరమ్మతులను పట్టించుకోని సర్కారు

బుట్టదాఖలవుతున్న ప్రతిపాదనలు  

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): హాస్టల్‌ భవనా లు శిథిలావస్థకు చేరాయి.. విద్యార్థుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి! ఇటీవల బోధన్‌లోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతిగృహంలో పైకప్పు కూలి ముగ్గురు విద్యార్థినులకు తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ప్రస్తు తం శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ వసతిగృహాల్లో ఉండేందుకు విద్యార్థులు జంకుతున్నారు. తమ వసతిగృహం పైకప్పు కూడా కూలి తమపై పడుతుందని భయం భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. అయితే, హాస్టళ్లకు మరమ్మతులు చేయించాలని జిల్లా నుంచి ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపినా సర్కారు.. వాటిని బుట్టదాఖలు చేస్తోంది. దీంతో నిధులు లేక హాస్టళ్లలో మరమ్మతు కరువయ్యాయి. 

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బోధన్‌లోని బీసీ హాస్టల్‌లో పైకప్పు కూలిపోయి విద్యార్థినులపై పడిందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం నిధులిస్తే హాస్టల్‌కు మరమ్మతులు చేయించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లలో చాలా వరకు సౌకర్యాలు సక్రమంగా లేవు. స్లాబు లీకేజీ, బోరు రిపేర్, విరిగిన కిటికీలు, తలుపులు, డ్రైనేజీ వసతులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఫ్యాన్లు, విద్యుత్‌ దీపాలు, పైపులైన్లు, సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీనింగ్, టాయిలెట్స్, బాత్‌రూంలు, వాటర్‌ ప్లాంటు, ఫ్లోరింగ్, ఇతర పనులు చేయించాల్సి ఉంది.

ఆయా పనుల కోసం నిధులు మంజూరు చేయాలని చాలా సార్లు అంచనాలు వేసి ప్రతిపాదనలు జిల్లా శాఖల నుంచి రాష్ట్ర శాఖల ద్వారా ప్రభుత్వానికి వెళ్లాయి. ప్రస్తుతం జిల్లాలో ఎస్సీ ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లు, పోస్టు మెట్రిక్‌ కలిపి 39 ఉన్నాయి. అన్ని హాస్టళ్లలో కలిపి దాదాపు రూ.2 కోట్ల వరకు మరమ్మతులకు ప్రతిపాదనలు గతేడాది వెళ్లాయి. బీసీ హాస్టళ్ల విషయానికి వస్తే 19 ప్రీ మెట్రిక్, 4 పోస్టు మెట్రిక్‌ కలిపి మొత్తం 23 హాస్టళ్లు ఉండగా, 4 వేలకు పైగా విద్యార్థులు వసతి పొందుతున్నారు. అయితే, వీటిలో మరమ్మతుల కోసం బీసీ సంక్షేమ శాఖ నుంచి రూ.1.25 కోట్ల అంచనాతో గతేడాది ప్రతిపాదనలు పంపించారు. మొత్తం హాస్టళ్లకు కలిపి జిల్లాకు దాదాపు రూ.3.50 కోట్ల వరకు నిధులు అవసరం ఉండగా, ఆ ప్రతిపాదనలను ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం తిరస్కరించింది.

 మరోసారి ప్రతిపాదనలు..

బోధన్‌లో బీసీ బాలికల కళాశాల హాస్టల్‌ పైకప్పు కూలి ముగ్గురు విద్యార్థినులకు తీవ్ర గాయాలు కావడంతో మరమ్మతులు ఏయే హాస్టళ్లకు అత్యవసరమో గుర్తించారు. నిజామాబాద్‌లో బాలికలు, బాలుర హాస్టళ్లు, ఆర్మూర్‌లో బాలుర, బాలికల వసతి గృహాలు, రెంజల్‌ బాలికల హాస్టల్, బోధన్‌ బాలికల హాస్టళ్లు రెండు, మోపాల్‌ బాలుర హాస్టల్, కుద్వాన్‌పూర్‌ బాలుర హాస్టల్, బాల్కొండ బాలుర, బాలికల వసతిగృహాలు, చౌట్‌పల్లి బాలుర హాస్టల్, పడగల్‌ బాలుర హాస్టల్, కోటగిరి బాలుర హాస్టల్, మాక్లూర్‌ బాలుర హాస్టల్‌ కలిపి 15 హాస్టళ్లలో మరమ్మతులు అత్యవసరమని, ఇందుకు రూ.55.65 లక్షలు అవసరమని ప్రతిపాదనలను ఇటీవల బీసీ సంక్షేమ శాఖ నుంచి వెళ్లాయి. ఇటు కలెక్టర్‌ రామ్మోహన్‌రావు కూడా నిధుల కోసం రాష్ట్ర శాఖలకు లేఖ రాయడానికి సిద్ధమైనట్లు సమాచారం. మరీ ఈ నిధులనైనా ప్రభుత్వం మంజూరు చేస్తుందో లేదో..?  

మరిన్ని వార్తలు