కడుపులో కణతిని తొలగించి వైద్యులు

7 Feb, 2020 09:27 IST|Sakshi
ప్రాణాపాయం నుంచి బయటపడిన విద్యార్థిని లక్ష్మి

సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం): ఓ ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం సమయస్ఫూర్తితో ఓ విద్యార్థి ప్రాణాపాయం నుంచి బయట పడింది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన విద్యార్థి ప్రాణానికే ముప్పు వాటిల్లేది. వివరాలిలా.. మండలంలోని దబ్బతోగు గ్రామానికి చెందిన మల్లం లక్ష్మి అనే విద్యార్థిని బీమునిగూడెం ఐటీడీఏ బాలికల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కాగా నెల రోజుల క్రితం ప్రత్యేక కోచింగ్‌లో భాగంగా అశ్వారావుపేట మండలంలోని అనంతారం గ్రామంలోని బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చేరగా, అనాటి నుంచి ఇక్కడే చదువుతుంది. ఈ క్రమంలోనే గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి రాగా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాఠశాల హెచ్‌ఎం అజ్మీర కృష్ణకుమారి తక్షణమే స్పందించి తన కారులోనే గుమ్మడవల్లి ప్రభుత్వ వైద్యాశాలకు తరలించి వైద్యం చేయించారు.

ఐనా సరే కడుపు నొప్పి తీవ్రత తగ్గకపోవడంతో అశ్వారావుపేట వైద్యాశాలకు తరలించగా పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. దాంతో హుటాహుటిన సత్తుపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థిని కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. తక్షణమే శస్త్ర చికిత్స చేసి తొలగించకపోతే కణితి పగిలిపోయి ప్రాణాపాయం కలుగుతుందని చెప్పారు. దీంతో హెచ్‌ఎం స్పందించి అన్నీ తానే అయి శస్త్ర చికిత్స చేయించారు. దీంతో తెల్లవారు జామున శస్త్ర చికిత్స చేసి ఆమె కడుపులో నుంచి కేజీ బరువు ఉన్న కణితిని తొలగించారు. అనంతరం విద్యార్థిని ప్రాణపాయం తప్పి ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హెచ్‌ఎం సమయస్ఫూర్తి, సకాలంలో స్పందించడం వల్లే శస్త్రచికిత్స చేసి విద్యార్థిని ప్రాణాలు కాపాడగలిగినట్లు వైద్యులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు