మా రూటు..  కార్పొ‘రేటు’

9 May, 2018 01:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 సర్కారు కొలువులకు వైద్యుల విముఖత

1,133 స్పెషాలిటీ పోస్టులకు 337 దరఖాస్తులే

కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో భారీ ప్యాకేజీలు లభిస్తుండటం వల్లే..

సాక్షి, హైదరాబాద్‌ : సర్కారు కొలువులకు స్పెషాలిటీ వైద్యులు ముఖం చాటేస్తున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌కు స్పందనే కరువైంది. మొత్తం 1,133 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్టు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించగా 337 దరఖాస్తులకు మించి రాలేదు. స్పెషలిస్టులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చెల్లిస్తున్న వేతనాలతో పోలిస్తే కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఇస్తున్న ప్యాకేజీలు రెండు మూడు రెట్లు అదనంగా ఉండటమే ఇందుకు కారణం.

జిల్లా, మండల కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో కంటే నగరంలోని ఆస్పత్రుల్లో పనిచేయడానికే స్పెషాలిటీ డాక్టర్లు ఎక్కువ ఇష్టపడుతున్నారు. 149 గైనకాలజీ పోస్టులకు 42 దరఖాస్తులు రాగా, 172 పీడియాట్రిక్స్‌ పోస్టులకు 31 దరఖాస్తులే వచ్చాయి. 176 అనస్థీషియా పోస్టులకు 38 దరఖాస్తులు, 107 జనరల్‌ సర్జన్‌ పోస్టులకు 32 దరఖాస్తులు అందాయి. ఇక ఆర్థోపెడిక్, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, సైక్రియాటిక్‌ విభాగాల్లో 192 ఖాళీ పోస్టులకు 129 దరఖాస్తులే అందడం గమనార్హం. 

అధిక ప్యాకేజీల వల్లే.. 
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులతో పోలిస్తే.. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఇస్తున్న ప్యాకేజీలు అధికంగా ఉన్నాయి. కాస్త అనుభవం ఉండి, రోగుల్లో మంచి గుర్తింపు ఉన్న వైద్యులకు కార్పొరేట్‌ ఆసుపత్రులు నెలవారీ ప్యాకేజీ రూ.10 లక్షల వరకు ఇస్తున్నాయి. అదే ప్రభుత్వ ఆస్పత్రిలో ఎన్ని సర్జరీలు చేసినా.. ఎంత గుర్తింపు పొందినా వేతనంలో మాత్రం తేడా ఉండదు. నిమ్స్‌లో పనిచేసే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.20 లక్షలు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.60 నుంచి రూ.1.80 లక్షలు, ప్రొఫెసర్‌కు రూ.2 లక్షల వరకు వేతనం చెల్లిస్తున్నారు. అదే ఉస్మానియా, గాంధీ, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం బేసిక్‌ వేతనం రూ.40 వేలతో మొదలవుతుంది. సీనియర్‌ వైద్యులకు రూ.లక్ష చెల్లిస్తున్నారు.

ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ సాధారణ వైద్యుడి వేతనంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అంతేకాదు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులు లేకపోవడంతోపాటు అంతర్గత రాజకీయాలు కూడా స్పెషలిస్టులు వైద్యులు కార్పొరేట్‌ వైపు వెళ్లడానికి మరో కారణమని సీనియర్‌ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా ఎవరూ రాకపోవడంతోపాటు ఇప్పటికే ఆయా ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులు కూడా స్వచ్ఛందంగా ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. ఎప్పటికప్పుడు ఆయా ఆస్పత్రులను మెరుగుపరిచి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం చాలా కాలంగా పట్టించుకోవడం లేదు. 

పనిభారం.. అవమానాలు: డాక్టర్‌ లాలు ప్రసాద్, కన్వీనర్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం 

గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ శాతం పెరిగింది. ఆస్పత్రుల్లో రోగులు, వైద్యుల నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. అవసరమైన నర్సులు, పారామెడికల్‌ స్టాఫ్, వైద్య పరికరాలు ఉండటం లేదు. వేతనాల చెల్లింపులోనే కాదు పదోన్నతుల్లో కూడా తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని భారం పెరగడంతోపాటు తక్కువ కేడర్‌ ఉన్న వ్యక్తులు ఆస్పత్రులకు వచ్చి రోగుల సమక్షంలోనే వైద్యులను అవమానించడం, దాడులకు పాల్పడం వంటి ఘటనలు కూడా వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రుల వైపు మొగ్గుచూపకపోవడానికి కారణం.  

మరిన్ని వార్తలు