వ్యవసాయం దండగ కాదు..పండగ

13 May, 2018 10:34 IST|Sakshi
రైతుకు పట్టా పాస్‌పుస్తకం, చెక్కు అందజేస్తున్న కడియం శ్రీహరి, సీతారాంనాయక్‌

నర్సంపేట రూరల్‌ : వ్యవసాయం దండగ అని నాటి పాలకులు మాట్లాడితే.. దండగ కాదు.. పండగ అని నేడు సీఎం కేసీఆర్‌ చేసి చూపిస్తున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. నర్సంపేట మండలం భాంజీపేట గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన ‘రైతుబంధు’ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మహబూబాబాద్‌ ఎంపీ సీతారాంనాయక్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం మాట్లాడుతూ నాడు కరెంటు, విత్తనాలు, గిట్టుబాటు ధర కోసం అన్నదాతలు రోడ్కెక్కితే.. నేడు వ్యవసాయానికి ఉచితంగా 24గంటల విద్యుత్‌ అందిస్తున్నామన్నారు.

ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడంతోపాటు పెట్టుబడికి ఏడాదికి రెండు పంటలకు ఎకరానికి రూ.4వేలు అందిస్తున్నది తెలంగాణ సర్కారు మాత్రమే అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలతోపాటు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. ప్రతి ఇంటికి నల్లా నీటిని అందించాలనే ఉద్దేశంతో మిషన్‌ భగీరథ పనులు, ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వడానికి దేవాదుల ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ కాల్వలను ఆధునికీకరణకు శ్రీకారం చుట్టిందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి రెండు పంటలకు నీరందించవచ్చన్నారు. ఎంపీ సీతారాంనాయక్‌ మాట్లాడుతూ గత పాలకులు సంక్షోభంలోకి నెట్టిన వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్‌ హరిత, వ్యవసాయ శాఖ జేడీఏ ఉషాదయాళ్, ఆర్డీఓ రవి, వ్యవసాయ శాఖ ఏడీఏ తోట శ్రీనివాసరావు, ఏసీపీ సునీతామోహన్, ఎంపీపీ బాదావత్‌ భద్రమ్మ, జెడ్పీటీసీ అజ్మీరా పద్మ, సర్పంచ్‌లు భూక్య లలితా వీరునాయక్, భాషబోయిన సాంబక్క రవి, వైస్‌ ఎంపీపీ కట్ల సుదర్శన్‌రెడ్డి, ఎంపీటీసీ భాషబోయిన సునీతారాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు మచ్చిక నర్సయ్యగౌడ్, గూళ్ల అశోక్‌ , రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ రాయిడి రవీందర్‌రెడ్డి, మండల కన్వీనర్‌ మోతె జయపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ పూల్‌సింగ్‌ చౌహన్, మండల వ్యవసాయాధికారి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు