‘కంటోన్మెంట్‌’ ఖరారు

24 Sep, 2019 08:15 IST|Sakshi

కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికలకు రంగం సిద్ధం 

ఒకటి ఎస్సీ, మహిళలకు మూడు కేటాయింపు 

లాటరీ పద్ధతిలో మహిళా వార్డుల ఎంపిక

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కీలకమైన ఓటరు లిస్టు తుదిజాబితాను గత వారమే విడుదల చేశారు. అక్టోబర్‌ మొదటి వారంలో వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్‌ నెలాఖరు లేదా నవంబర్‌ తొలి పక్షంలో నోటిషికేషన్‌ వెలువడే అవకాశమున్నట్లు స్పష్టమవుతోంది. 2015 జనవరి 11 ఎన్నికలు జరగ్గా, ఫిబ్రవరిలో కొత్త బోర్డు కొలువు తీరింది. ఈ ప్రకారం 2020 ఫిబ్రవరిలోపు బోర్డు ఎన్నికల ప్రక్రియ ముగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల తీరుపై ప్రత్యేక కథనం.. 

సాక్షి, కంటోన్మెంట్‌: ప్రత్యేక ఓటరు జాబితా సాధారణంగా దేశ వ్యాప్తంగా ఏ ఎన్నికలైనా ఎన్నికల కమిషన్‌ రూపొందించిన ఓటరు లిస్టే ప్రామాణికం. చట్ట సభలైన అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల్లోనూ ఇదే లిస్టు ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే కంటోన్మెంట్లలో మాత్రం ప్రత్యేక ఓటరు లిస్టు ఉంటుంది. పార్లమెంట్‌ ఆమోదించిన ‘ది కంటోన్మెంట్స్‌ యాక్ట్‌–2006’కు లోబడి రూపొందించిన ‘కంటోన్మెంట్‌ ఎలక్టోరల్‌ రోల్స్‌–2007’ ఆధారంగా ఓటరు జాబితాను రూపొందిస్తారు. ఇటీవల జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన కంటోన్మెంట్‌ ఓటర్లలో చాలామందికి వివిధ కారణల వల్ల బోర్డు ఎన్నికల జాబితాలో అవకాశం కల్పించలేదు.

రిజర్వేషన్లు ఇలా.. 
కేటగిరి–ఏకు చెందిన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో మొత్తం ఎనిమిది వార్డులున్నాయి. 2006 వరకు ఏడు వార్డులే ఉండగా, 2006లో కొత్త చట్టం అమల్లోకి రావడంతో తొలిసారిగా మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు మూడు వార్డులు మహిళలకు రిజర్వ్‌ అయ్యాయి. ఒక వార్డు ఎస్సీ– జనరల్‌కు రిజర్వ్‌ అయింది. ఇక మిగిలిన నాలుగు జనరల్‌ వార్డులున్నాయి. అయితే ఎస్సీ రిజర్వ్‌డ్‌ వార్డు మినహా  మిగిలిన ఏడు వార్డుల్లో మహిళా రిజర్వేషన్లను రోటేషన్‌ పద్ధతిలో ఎంపిక చేస్తారు. 2008లో 1, 5, 6 వార్డుల నుంచి మహిళలు ప్రాతినిధ్యం వహించారు. 2015లో జరిగిన ఎన్నికల్లో ఈ మూడు వార్డులను జనరల్‌ కేటగిరీకి మార్చగా, మిగిలిన నాలుగు జనరల్‌ స్థానాల్లో డ్రా పద్ధతిలో 3, 4, 7 వార్డులు మహిళా రిజర్వ్‌ అయ్యాయి. 2వ వార్డు గత రెండు పర్యాయాల నుంచి జనరల్‌ కేటగిరీలో ఉండగా, 8వ వార్డు ఎస్సీ రిజర్వ్‌డ్‌గా ఉంది.

తాజా పరిస్థితి.. 
ప్రస్తుత బోర్డులో 3,4, 7 వార్డులు మహిళలకు కేటాయించగా, ఆయా వార్డుల నుంచి అనిత ప్రభాకర్, నళిని కిరణ్, పి. భాగ్యశ్రీ బోర్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ స్థానాలు జనరల్‌ కేటగిరీలోకి మారనున్నాయి. మిగిలిన 1, 2, 5, 6 వార్డుల్లో డ్రా పద్ధతిలో మూడింటిని మహిళలకు కేటాయించనున్నారు. ఆయా వార్డుల నుంచి జక్కుల మహేశ్వర్‌రెడ్డి, సాద కేశవరెడ్డి, రామకృష్ణ, పాండుయాదవ్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ తమ స్థానాలు మహిళలకు కేటాయిస్తే, తమ కుటుంబ సభ్యులను నిలబెట్టేందుకు ఆయా నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక లోకనాథం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనిమిదో వార్డు మళ్లీ ఎస్సీ–రిజర్వ్‌డ్‌గా ఉండనుంది. 2011 జనాభా లెక్కలు ప్రామాణికంగా ఎస్సీ స్థానాన్ని ఎంపిక చేస్తున్నందున ఈ సారి కూడా 8వ వార్డు ఎస్సీ కేటగిరీలోనే ఉండటం ఖాయం.

ఇప్పటి దాకా ఏడుగురు ప్రాతినిధ్యం 
కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావడంతో మహిళా బోర్డు సభ్యుల ప్రాతినిథ్యం పెరిగింది. 2008ఎన్నికల్లో ఒకటో వార్డు నుంచి జంపన విద్యావతి, ఐదో వార్డు నుంచి జే. అనూరాధ, ఆరోవార్డు నుంచి భానుక నర్మద బోర్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. 2015లో ఆయా స్థానాలు జనరల్‌గా మారగా, వీరు పోటీ నుంచి తప్పుకుని కుటుంబ సభ్యులకు అవకాశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో అనిత ప్రభాకర్, నళినికిరణ్, పి.భాగ్యశ్రీ బోర్డు సభ్యులు ఎన్నికయ్యారు. అయితే ఎలాంటి మహిళా రిజర్వేషన్లు అమల్లో లేని 2006లోనూ ఏ. మంజుల రెడ్డి బోర్డు సభ్యురాలిగా ఎన్నికై, తొలి మహిళా బోర్డు సభ్యురాలిగా రికార్డు సృష్టించారు. ఆమె  కంటోన్మెంట్‌ బోర్డు మాజీ సానిటరీ ఇన్‌స్పెక్టర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి సతీమణి. ఇదిలా ఉండగా మిగిలిన ఆరుగురు మహిళా బోర్డు సభ్యుల్లో భానుక నర్మద మినహా మిగిలిన వారంతా, మాజీ బోర్డు సభ్యుల వారసులిగానే బోర్డులో అడుపెట్టారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా