మారేడ్‌పల్లి రిలయన్స్‌ ఫైర్‌సేఫ్టీలో పేలుడు..

14 Mar, 2019 03:28 IST|Sakshi
పేలుడు ధాటికి ధ్వంసమైన భవనం. (ఇన్‌సెట్‌లో) మృతుడు జంగా రాజు (ఫైల్‌)

చెలరేగిన మంటలు.. ఒకరు సజీవ దహనం.. 

ఇద్దరికి తీవ్ర గాయాలు 

మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది 

రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని ఓ కంపెనీలో పేలుడు సంభవించింది. పేలుడుతో పాటు మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. మరికొందరికి గాయాలయ్యాయి. వెస్ట్‌మారేడ్‌పల్లిలోని సయ్యద్‌ జలాల్‌ గార్డెన్‌ వద్ద ప్లాట్‌ నంబర్‌–5లో రిలయన్స్‌ ఫైర్‌సేఫ్టీ లిమిటెడ్‌ పేరుతో ఓ కంపెనీ నడుస్తోంది. కంపెనీ ఎండీగా అరుణ్‌ ఆంథోనీరాజ్‌ వ్యవహరిస్తున్నారు. చర్లపల్లిలో ఫ్యాక్టరీ ఉండగా మారేడుపల్లిలో రెండతస్తుల భవనంపై రేకుల షెడ్డును గోదాంగా వాడుతున్నారు.

ఫైర్‌ సేఫ్టీ పరికరాలను ఇందులో నిల్వ ఉంచారు. బుధవారం ఉదయం 11.45 నిమిషాల ప్రాంతంలో పైఅంతస్తులో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం ధ్వంసం కావడంతో పాటు స్థానికంగా ఉన్న పలువురి ఇళ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. రెండు బైక్‌లు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత భవనం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ సంస్థలో స్టోర్‌ కీపర్‌గా పనిచేస్తున్న జంగా రాజు సజీవ దహనమయ్యాడు. రాజు పశ్చిమ గోదావరి జిల్లా దద్దులూరు గ్రామానికి చెందిన వాడు. 

పలువురికి గాయాలు.. 
ఈ ఘటనలో మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో జంగా రాజుతో పాటు అక్కడే పనిచేస్తున్న అతడి బావమరిది ఇస్మాయిల్‌ ఉన్నాడు. ఇస్మాయిల్‌ కింది అంతస్తులో ఉండగా, రాజు పైఅంతస్తులో ఉన్నాడు. పేలుడు జరిగిన వెంటనే మంటలు వచ్చాయని, మంటల్లో రాజు సజీవ దహనమయ్యాడని ఇస్మాయిల్‌ కన్నీరుమున్నీరయ్యాడు. రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పాడు. ప్రమాదం జరిగిన సమయంలో మరో వ్యక్తి పైఅంతస్తుకు వెళ్లేందుకు ప్రయత్నించగా శిథిలాలు మీద పడటంతో గాయాల పాలయ్యాడు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక బృందం వెంటనే ఘటనాస్థలానికి చేరుకుంది. మంటలు ఆర్పుతున్న సమయంలో మరోసారి పేలుడు సంభవించడంతో అగ్నిమాపక బృందం వెంకటేశ్‌ కొద్దిదూరం ఎగిరిపడ్డాడు. వెంకటేశ్‌ తలకు హెల్మెట్‌ ఉండటంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కాగా, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు రంగలోకి దిగింది. జిల్లా ఫైర్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని మారేడ్‌పల్లి సీఐ శ్రీనివాసులు తెలిపారు. ప్రమాదం గ్యాస్‌ సిలిండర్‌ కారణంగా జరిగిందా.. లేదా ఫైర్‌సేఫ్టీ పరికరాల వల్ల జరిగిందా అనే విషయాలు దర్యాప్తులో తెలుస్తాయని చెప్పారు. 

మరిన్ని వార్తలు