బిడ్డ పెళ్లి చేయలేక రైతు ఆత్మహత్య

26 Nov, 2014 01:05 IST|Sakshi

 అప్పుల బాధతో ఒకరికి గుండెపోటు
 సాక్షి నెట్‌వర్క్: తెలంగాణ జిల్లాల్లో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. పంటను నమ్ముకొని చేసుకున్న ఒప్పందాలు.. చేసిన అప్పులు చివరకు ప్రాణాలు తీసుకునే పరిస్థితిలోకి నెడుతున్నాయి. బిడ్డ పెళ్లి చేసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకోగా, అప్పుల బాధతో ఒకరు గుండెపోటుకు గురయ్యారు. మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం బెంగ్లూర్‌కు చెందిన పంతంగి బాపు తనకున్న రెండెకరాల్లో పత్తి సాగు చేశారు. పంట పండితే బిడ్డ పెళ్లి ఘనంగా చేయాలని భావించి వరపూజ చేశాడు. కానీ, వర్షాభావ పరిస్థితుల్లో పత్తి చేను ఎండిపోయి దిగుబడి పూర్తిగా తగ్గింది.
 
  మరోవైపు అప్పుల భారం పెరిగింది. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడం.. బిడ్డపెళ్లి చేయలేని ఆసహాయ స్థితిలో ఈ నెల 13న బాపు ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగాడు. రెండు వారాలుగా వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాబు పరిస్థితి విషమించి సోమవారం రాత్రి చనిపోయాడు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం హంగిర్గా(కే)కు చెందిన మల్‌రెడ్డి(45) తన మూడెకరాల్లో సాగు చేస్తున్నాడు. ఇటీవల మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, కంది వేశాడు. ఈ క్రమంలో రూ. 2 లక్షలు అప్పు చేశాడు. రుణాల రీషెడ్యూల్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఎంతకీ అప్పు తీరే మార్గం కనిపించకపోవడంతో ఆందోళన చెంది మంగళవారం గుండెపోటుతో మరణించాడు.
 
వరంగల్ జిల్లా నర్మెట మండలం తరిగొప్పుల పంచాయతీ పరిధి బోజ్య తండాకు చెందిన మహిళా రైతు మూడావత్ హూనీ(50) భర్త బీల్యాతో కలసి ఎనిమిది ఎకరాల్లో సాగు చేస్తోంది. వర్షాభావ పరిస్థితుల్లో పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో రూ. 4 లక్షల వరకు అప్పు అయ్యింది. అప్పు తీరే మార్గం కనిపించకపోవడంతో మంగళవారం ఇంట్లో క్రిమిసంహారక మందు తాగింది.

మరిన్ని వార్తలు