ఆగిన అన్నదాత గుండె

28 Mar, 2018 14:08 IST|Sakshi
గంగారాం మృతదేహం 

 వరిపైరు ఎండుతుందన్న    మానసిక వ్యధతో.. 

 పొలం వద్ద గుండెపోటుతో     మరణించిన పెద్ద గంగారాం  లోలం గ్రామంలో ఘటన

ఇందల్‌వాయి: అప్పుచేసి పెట్టుబడి పెట్టి నాలుగు నెలలుగా రేయింబవళ్లు కష్టపడుతూ కంటికిరెప్పలా కాపాడుకుంటున్న వరిపంట చివరి దశలో నీరందకపోవడంతో ఆ రైతు ఆవేదన చెందాడు.. పది రోజులుగా నిద్రాహారాలు మాని పొలంవద్దనే ఉంటూ బొట్టుబొట్టును పంటకు మళ్లిస్తున్న రైతు పంట పండుతుందో లేదో.. అప్పులు తీరుతాయో లేదో అని తీవ్ర ఆవేదన చెందాడు.. చివరికి తన పొలం వద్దే గుండె ఆగి తనువు చాలించాడు.  ఇందల్వాయి మండలం లోలం గ్రామానికి చెందిన జల్లా పెద్దగంగారం తనకున్న ఎకరంనర పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కూలి పనులకు వెళ్తూ తన ఇద్దరు భార్యలు, ఒక దత్తత పుత్రుడితో జీవనం సాగించేవాడు.
గతం లో కుటుంబ పోషణ నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లిన గం గారాం అక్కడ సరైన ఉపాధి దొరకక స్వగ్రామానికి తిరిగి వచ్చి ఇక్కడే ఉంటున్నాడని గ్రామస్తు లు తెలిపారు. ఈ క్రమంలో మూడేళ్లుగా సరైన వర్షాలు లేక, పంటలు చేతికి రాక రూ. 3 లక్షలదాకా అప్పు చేశాడు. ఈసారి రబీలో 25 వేలు అప్పు చేసి ఎకరంనర పొలం సాగు చేశాడు గం గారాం. తనకున్న బోరుబావి నుంచి మొదట్లో నీరు బాగా అందినా గత 15 రోజుల నుంచి పంటకు సరిగా నీరు అందకపోవడంతో మోటారును ఇంకా లోతులోకి దించేందుకు మరో 5 వేలు అప్పు చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయినా నీరు సరిపడా రాకపోవడంతో వారం రోజులనుంచి తీవ్ర ఆందోళనలో గంగారాం ఉన్నాడని అన్నం కూడా సరిగా తినక రేయింబవళ్లు పొలం వద్దనే ఉంటూ పొలానికి నీరు పెడుతున్నాడని అన్నారు.

ఈ క్రమంలో సోమవారం రాత్రి పొలం వద్దకు వెళ్లిన గంగారాం ఉదయం ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా మంచంపైనే విగతజీవిగా పడి ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పొలం ఎండిపోతుందన్న మానసిక వేదనతో గుండెపోటుకు గురై చనిపోయాడని భావిస్తున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.  అనం తరం ఎస్సై రాజశేఖర్‌ ఘటనా స్థలానికి చేరుకు ని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు