ఫీజు రీయింబర్స్‌మెంటుకు ప్రత్యేక బడ్జెట్‌: పల్లా 

23 Dec, 2018 02:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ కోర్సుల్లో ఫీజు రీయింబర్స్‌మెంటుకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించేందుకు కృషిచేస్తానని శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఇంటర్మీడియెట్‌ ఫీజు ప్రతి ఏటా 10 శాతం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని, డిగ్రీలో కామన్‌ ఫీజుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ అభివృద్ధిలో ప్రైవేటు విద్యాసంస్థల పాత్ర–ప్రభుత్వ తోడ్పాటు ఆవశ్యకత అనే అంశంపై సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సంఘం పేరుతో ఓ రాజకీయ పార్టీకి తాకట్టుపెట్టడం సమంజసం కాదన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆ సంఘం అసత్య ఆరోపణలు చేసిందని, ఫీజు రీయింబర్స్‌మెంటుపై దుష్ప్రచారం చేసిందని చెప్పారు. 2013–14కు సంబంధించిన రూ.2,200 కోట్ల బకాయిల విడుదలలో కొంత ఇబ్బంది వచ్చిందన్నారు. 2018–19 విద్యాసంవత్సరానికి మొత్తం ఫీజులొచ్చాయని, కేవలం రూ.100 నుంచి రూ.150 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంటు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ఫైర్‌ ఎన్‌ఓసీ నుంచి మినహాయింపు ఇచ్చే ఫైలుపై సీఎం సంతకం చేశారని చెప్పారు.    

మరిన్ని వార్తలు