పక్కాగా పదోన్నతులు

10 Jun, 2019 02:19 IST|Sakshi

బోధనాసుపత్రుల్లోని వైద్యులకు నిర్ణీత కాల ప్రమోషన్లు 

గతేడాది ఎన్నికలకు ముందు జారీచేసిన జీవోలో సాంకేతిక సమస్య 

దానికి సవరణ చేయాలంటూ ప్రతిపాదనలు పంపిన డీఎంఈ 

ఎట్టకేలకు సంబంధిత ఫైలుకు తాజాగా సీఎం కేసీఆర్‌ ఆమోదం 

పోస్టులు ఉన్నా, లేకపోయినా ఇక నుంచి సకాలంలో పదోన్నతి 

త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం... 

ప్రభుత్వ వైద్యుల సంఘం నేతల వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ మెడికల్, డెంటల్‌ కాలేజీలు, వాటి అనుబంధ బోధనాసుపత్రుల్లో పని చేసే వైద్యులకు శుభవార్త. వారికి ఇక నుంచి నిర్ణీతకాలంలో పదోన్నతులు లభిస్తాయి. గతేడాదే ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినా సాంకేతిక కారణాలతో అది అమలుకాలేదు. ఆ తర్వాత వరుసగా ఎన్నికలు రావడంతో ఇప్పటివరకు ఆ ఉత్తర్వులు సవరణకు నోచుకోలేదు. సవరణలు కోరుతూ వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అందుకు సంబంధించిన ఫైలుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శి నరహరి ‘సాక్షి’కి తెలిపారు.

2016 యూజీసీ వేతన సవరణను అనుసరించి ఉత్తర్వులు వెలువడతాయని ఆయన ప్రకటించారు. తాజా నిర్ణయం ప్రకారం.. బోధనాసుపత్రుల్లో పనిచేసే అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల సర్వీసు నాలుగేళ్లు నిండితే యథావిధిగా వారికి అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిస్తుంది. అలాగే అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఆరేళ్లు సర్వీసు నిండితే యథావిధిగా వారికి ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిస్తుంది. మరోవైపు అసోసియేట్‌ ప్రొఫెసర్లకు మూడేళ్లు నిండాక స్కేల్‌లో మార్పు తీసుకొస్తారు. అంటే వారికి మధ్యలో ఒక ఆర్థిక ప్రయోజనం కల్పిస్తారు.  

పదోన్నతుల కోసం ఎదురుచూపు... 
ప్రస్తుతం పదోన్నతులు అత్యంత అశాస్త్రీయంగా ఉన్నాయన్న విమర్శ ఉంది. ఎవరైనా రిటైరయ్యాకే అంటే ఖాళీలు ఏర్పడ్డాకే పదోన్నతులు లభిస్తున్నాయి. ఖాళీలు కొన్నే ఉంటే కొందరికే పదోన్నతులు లభిస్తున్నాయి. దీంతో పదోన్నతుల కోసం ఎవరో ఒకరి దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అందుకోసం ఫైరవీలు జరిగి లక్షలకు లక్షలు సమర్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని వైద్యులు ఆవేదన చేస్తున్నారు. ఒక్కోసారి పదేళ్లకు, పదిహేనేళ్లకు పదోన్నతులు వచ్చినవారూ ఉన్నారు. ఈ పరిస్థితిని మార్చాలని వైద్యులు ఎన్నాళ్లుగానో డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు నిర్ణీతకాల పదోన్నతులను అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న దాదాపు 3 వేల మంది వైద్యులకు ప్రయోజనం కలుగనుంది.

అంతేకాదు వారికి పదోన్నతి వచ్చిన ప్రతీసారి కూడా స్కేల్స్‌ల్లోనూ మార్పులుంటాయి. ప్రొఫెసర్‌గా ఉన్న వారికి తదుపరి పదోన్నతి లేకపోయినా మధ్యమధ్యలో స్కేల్స్‌లో నిర్ణీత సమయం ప్రకారం మార్పులు జరుగుతుంటాయి. ఇక వైద్యులకు ఖాళీలు లేకపోయినా నిర్ణీత కాలంలో పదోన్నతులు ఇవ్వడంతో ఒక్కోసారి వారి హోదా మారుతుందే కానీ పనిలో మార్పు ఉండదు. ఖాళీలు ఏర్పడ్డాకే వారు ఇతర పోస్టులకు మారుతారు. అంటే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు ఖాళీలు లేకపోయినా నాలుగేళ్లకు అసోసియేట్‌గా పదోన్నతి లభిస్తే, అతను అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గానే విధులు నిర్వహిస్తారు. అక్కడ ఖాళీ ఏర్పడితేనే అతని విధులు మారుతాయి. ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినందున త్వరలోనే సవరణ ఉత్తర్వులు వెలువడతాయన్న ఆశాభావాన్ని డాక్టర్‌ నరహరి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు