ఉద్యమ ఆకాంక్ష నెరవేరుతోంది 

21 Jun, 2019 04:14 IST|Sakshi

కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి, కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలన్న ఉద్యమ ఆకాంక్షను నేరవేర్చే దిశగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం అనేది బలమైన అడుగని నీటిపారుదల శాఖ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల పోరాట ఫలితం, అమరుల త్యాగాల ఫలితంగానే ఈ కల సాకారమవుతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంతర కృషి ఫలితంగా కాళేశ్వరం సాధ్యమైందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నాటి సమైక్య పాలకులు కావాలనే అంతర్రాష్ట్ర వివాదాల్లో చిక్కుకునేలా లభ్యత లేని చోట ప్రాజెక్టు డిజైన్‌ చేస్తే, సీఎం కేసీఆర్‌ అపర భగీరథుడిలా.. ఓ ఇంజనీర్‌గా మారి అహోరాత్రులు శ్రమించి ప్రాజెక్టు రీడిజైన్‌ చేశారని కొనియాడారు.

మహారాష్ట్రతో నెలకొన్న వివాదాన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించి ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమం చేశారని పేర్కొన్నారు. ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తూ రికార్డు సమయంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో రేయింబవళ్లు శ్రమించిన ఇంజనీర్లకు, ఉద్యోగులకు, కార్మికులకు అభినందనలు తెలిపారు. ఈ సన్నివేశాన్ని ఆనందభాష్పాలతో తిలకిస్తున్న రాష్ట్ర రైతుల పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, సస్యశ్యామల తెలంగాణ స్వప్నం సాకారమయ్యేలా ఆశీస్సులు అందించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

మారనున్న తెలంగాణ ముఖచిత్రం: ఎస్‌కే.జోషి 
ధర్మారం: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రం మారిపొంతుందని, రైతుల కరువు బాధలు శాశ్వతంగా తీరుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే.జోషీ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ –6లో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండ లం నందిమేడారం వద్ద నిర్మించిన సర్జిపూల్‌ను వివిధ బ్యాంకర్లకు చెందిన 12 మంది ప్రతినిధులతో కలసి గురువారం ఆయన పరిశీలించారు. సర్జిపూల్, నీటి పంపింగ్, విద్యుత్‌ వినియోగం, మోటార్ల సామర్థ్యం, పనితీరును ఇంజనీర్లు వారికి వివరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో సీఎస్‌ జోషీ మాట్లాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదల, నిరంతర కృషి ఫలితంగా కాళేశ్వరం కల సాకారమైందని చెప్పారు.  మహారాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకుని ఎటువంటి వివాదాలు రాకుండా కేసీఆర్‌ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ కృషి ఫలితంగానే ఈ ఏడాది తొలి ఫలితం అందుతుందని చెప్పారు. రాజీవ్‌శర్మ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందించటానికి కేసీఆర్‌ చాలా కష్ట పడ్డారన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ హరిరామ్, బ్యాంకు ప్రతినిధులు పాక్రిసామి, భట్టాచార్య. పీకే.సింగ్, హేమంత్‌ కుమార వినోద్, విజయ్‌కుమార్, అశోక్, రామకృష్ణ, నవయుగ, మేగా కంపనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

బీజేపీకి కళ్ల మంట : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
సాక్షి, హైదరాబాద్‌: దేశం గర్వించదగిన రీతిలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించడం బీజేపీకి కళ్ల మంటగా మారిందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి గురు వారం శాసనసభ ఆవరణలోని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం కాదనే రీతిలో బీజేపీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేమితో విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ సొంత నిధులతో సీఎం కేసీఆర్‌ శ్రమతో కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే నిర్మాణం పూర్తి చేసుకుందన్నారు. గుజరాత్‌తో సహా బీజేపీ పాలిత ప్రాంతాల్లో కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎంపీలు.. స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. స్థలాభావంతో ఎమ్మెల్యేలను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని, ప్రాజెక్టు పనులు పూర్తయిన తర్వాత.. భారీగా వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. 

తెలంగాణలో నవ శకం : వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 
సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మూడేళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభంతో రాష్ట్రంలో నవ శకం ప్రారంభమవుతుందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్‌ తరాలు తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందు, ఆ తర్వాత అని గుర్తు చేసుకుంటారని తెలిపారు. 

చరిత్రాత్మక ప్రాజెక్టుగా కాళేశ్వరం: తలసాని 
సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం భారతదేశ చరిత్రలో చరిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఈ ప్రాజెక్టు సాగు, తాగునీటి అవసరాలు తీర్చే వరప్రదాయిని అని ఆయన కొనియాడారు. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, కళాకారులతో కలిసి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు.

బాధ్యత మరింత పెరిగింది: మారెడ్డి 
సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుతో పౌరసరఫరాల సంస్థ బాధ్యత మరింత పెరిగిందని సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో రెండు పంటలకు నీరు అందడంతో సాగు విస్తీర్ణం పెరిగి ధాన్యం దిగుబడి సైతం భారీగా పెరుగుతుందన్నారు. దీనికి అనుగుణంగా రైతుల నుంచి కనీస మద్దతు ధరకు పౌరసరఫరాల సంస్థ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. 

  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా