బీసీలకు పూర్తి ఫీజు ఇవ్వాలి ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌

26 Oct, 2017 03:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వృత్తివిద్యా కోర్సులు అభ్యసిస్తున్న బీసీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజులు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. పదివేల ర్యాంకు నిబంధనను వెంటనే తొలగించాలని కోరింది. ఈమేరకు బీసీ సంక్షేమ సంఘం బుధవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించింది. ఈ సందర్భంగా టీటీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల్లో ఐదు గ్రూపులుండగా... బీ కేటగిరీలోని దూదేకుల, లద్దాప్, నూర్‌బాష, జైన్, జొరాస్ట్రియన్, సీ కేటగిరీలోని క్రిస్టియన్లు, ఈ కేటగిరీలోని ముస్లింలకు పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లిస్తున్నారన్నారు.

హిందువులుగా ఉన్న బీసీలకు మాత్రం రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులిస్తున్నారన్నారు. అరకొరగా ఫీజులు ఇవ్వడంతో చాలామంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిలతో పాటు బీసీలకు పూర్తిస్థాయిలో నిధులివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ర్యాగ అరుణ్, గుజ్జ కృష్ణ, సత్యనారాయణ, కొప్పుల జగన్‌ గౌడ్, మహేందర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు