పార్కులకు సొబగులు అద్దండి

1 Mar, 2019 11:33 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న దానకిశోర్‌

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని 20 ప్రధాన జంక్షన్లు, ప్రధాన రహదారుల్లోని మీడియన్లను కొత్తగా ముస్తాబు చేయాలని, గన్‌పార్క్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ అధికారులను ఆదేశించారు. అర్బన్‌ బయోడైవర్సిటీ విభాగంపై గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 236 కిలోమీటర్ల విస్తీర్ణంలో 153 రోడ్లపై సెంట్రల్‌ మీడియన్లు ఉన్నాయని, వీటిలో వంద కిలోమీటర్ల మీడియన్లను మరింత ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యంగా 20 ప్రధాన జంక్షన్లను సీఎస్సార్‌ నిధులతో  పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని సూచించారు. 873 ల్యాండ్‌ స్కేప్‌ పార్కులు, 331 ట్రీ పార్కులు ఉన్నాయని, మరో 616 ఖాళీ స్థలాల్లో పార్కులు, ప్లాంటేషన్‌ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. పార్కుల అభివృద్దికి టెండర్ల ప్రక్రియ పూర్తయిన వాటి పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఇందిరా పార్కు, జూబ్లీహిల్స్‌లోని రాక్‌ గార్డెన్‌ను ఆధునిక రీతిలో అభివృద్ధి చేయాలని సూచించారు.

ఇకపై ‘హరిత శుక్రవారం’
జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతి శుక్రవారం హరిత దినోత్సవంగా పాటిస్తున్నట్టు  దానకిశోర్‌ తెలిపారు. ఇందులో భాగంగా జోనల్, డిప్యూటీ కమిషనర్లు విధిగా తమ పరిధిలోని పార్కులను సందర్శించి కాలనీ సంక్షేమ సంఘాలతో సమావేశమై వాటి అభివృద్ధిపై చర్చించాలని ఆదేశించారు.  హరిత శుక్రవారంలో వివిధ వర్గాల నుంచి వచ్చే సలహాలు, సూచనలు పాటిస్తామన్నారు. హరితహారంలో భాగంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 60 లక్షల మొక్కలను 56 నర్సరీల్లో పెంచుతున్నట్టు తెలిపారు. ఈసారి హరితహారంలో జీహెచ్‌ఎంసీకి 3 కోట్ల మొక్కల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని, నగరంలో ఉన్న 331 ట్రీ పార్కుల్లో విస్తృతంగా> మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్‌ కమిషనర్లు దాసరి హరిచందన, ఆమ్రపాలి, కృష్ణ, జోనల్‌ కమిషనర్లు శంకరయ్య, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు